నూజివీడు : నూజివీడు రెవెన్యూ డివిజన్ అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ అధికారిగా రావి రవి ప్రసాద్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, ఉద్యోగులు రవి ప్రసాద్ కు అభినందనలు తెలియజేశారు. స్థానిక విలేకరులతో మాట్లాడుతూ నాలుగు కళాశాల హాస్టళ్ళు, ప్రీ మెట్రిక్ హాస్టల్స్ 8 ఉన్నట్లు తెలిపారు. కళాశాల స్థాయిలో 110 మంది, ప్రీ మెట్రిక్స్ స్థాయిలో 388 మంది విద్యార్థులు హాస్టల్ వసతిని వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. రానున్న విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య, మౌలిక వసతుల పెంపు కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 46 ప్రకారం విద్యార్థులకు పూర్తి రక్షణ, ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఇందుకోసం డెమో క్లాసులు, వర్క్ షాపులను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు అందించే ఆహారంపై నిత్యం పర్యవేక్షణ కొనసాగుతుందని, మెనూ అమలుతీరు, ఆహార నాణ్యత పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మెరుగుపరిచేందుకు కృషి చేస్తామన్నారు. 12 హాస్టళ్లకు గాను రెండు హాస్టల్స్ అద్దె భవనాలలో కొనసాగుతున్నాయని, మిగిలిన 10 హాస్టల్స్ లో 35.90 లక్షల రూపాయలతో మరమ్మతులు నిర్వహిస్తామన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులలో ఔట్సోర్సింగ్ లో ఏడుగురు సిబ్బందిని నియమించేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామని, మంజూరు కాగానే సిబ్బంది నియామకం కొనసాగుతుందన్నారు. విధి నిర్వహణలో సిబ్బంది అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు.