సుబ్రమణ్య భారతి జయంత్యుత్సవాల్లో మోదీ
దిల్లీ: ప్రముఖ తమిళ కవి, స్వాతంత్ర్య సమరయోధుడు సుబ్రమణ్య భారతి మహిళా సాధికారతకు చేసిన కృషిని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. శుక్రవారం సుబ్రమణ్య భారతి 138వ జయంత్యుత్సవాల్లో ఆయన ప్రసంగించారు. ”సుబ్రమణ్య భారతి ఏదో ఒక రంగానికి అంకితం కాలేదు. ఆయన ఒక కవి, రచయిత, సంపాదకుడు, పాత్రికేయుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త. మహాకవి భారతీయార్ చెప్పినట్లు అభివృద్ధి అనేది మహిళల చుట్టూనే ఉంటుంది. వారెప్పుడూ స్వేచ్ఛగా తలెత్తుకొని జీవించాలి” అని మోదీ అన్నారు.
భారతీయార్ అడుగుజాడల్లో నడుస్తూ మహిళా సాధికారత కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మోదీ తెలిపారు. ఈ రోజు ముద్ర యోజనతో 15 కోట్లకు పైగా మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూత అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దేశ సాయుధ బలగాల్లో కూడా మహిళలు వారి శక్తిని నిరూపించుకుంటున్నారని ఆయన తెలిపారు. కరోనా కారణంగా ఈ ఏడాది భారతీయార్ జయంత్యుత్సవాలు వర్చువల్ విధానంలో జరిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సైతం ఇందులో పాల్గొన్నారు.