Breaking News

మాజీ అధ్యక్షులకు పింఛను ఎంతో తెలుసా?

ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించే అమెరికాకు అధ్యక్షుడు ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ విజయం సాధించారు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఓటమిని చవిచూశారు. ఇలా మాజీ అధ్యక్షులుగా మారి, శ్వేతసౌధాన్ని వీడిన నేతల జీవితం ఎలా ఉంటుంది? వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?

అమెరికాకు ఇప్పటి వరకు 45 మంది అధ్యక్షులయ్యారు. చరిత్ర చూస్తే చాలా మంది నేతలు రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా కొనసాగారు. కొద్ది మంది మాత్రమే ఒక్కసారే అధ్యక్షుడై ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే పదవి కాలం ముగిశాక ఆ తర్వాత వారు ఏం చేస్తారు? ఎలా జీవిస్తారనే విషయాన్ని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. వాళ్లు కూడా రాజకీయాలకు, మీడియాకు దూరంగా.. స్వచ్ఛంద సేవ, వ్యాపారాలు చేస్తూ జీవితం గడిపేందుకు ఇష్టపడతారు. అయితే, దేశానికి సేవలందించినందుకు గానూ వీరికి ప్రభుత్వం కొన్ని ప్రయోజనాలు కల్పిస్తోంది.

మొదట్లో మాజీ అధ్యక్షులకు ఎలాంటి ప్రయోజనాలు ఉండేవి కావు. అయితే 1912లో ఆండ్రూ కార్నెగీ అనే పారిశ్రామిక వేత్త మాజీ అధ్యక్షులకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఆ కాలంలోనే ఏటా 25వేల డాలర్లు పింఛను ఇస్తానని ప్రకటించారు. కానీ, అప్పటి నేతలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశాధినేతలుగా వ్యవహరించినవారికి ఓ ప్రైవేటు వ్యక్తి పింఛను ఇవ్వడమేంటని ప్రశ్నించారు. అలా ప్రభుత్వానికే మాజీలకు ఏదైనా ప్రయోజనం కల్పించాలనే ఆలోచన తట్టింది. ఆ ఆలోచనకు ఫలితంగానే 1958లో ‘ఫార్మర్‌ ప్రెసిడెంట్‌ యాక్ట్‌’ అమల్లోకి వచ్చింది. ఈ యాక్ట్‌ ప్రకారం.. మాజీ అధ్యక్షులకు ప్రభుత్వం పింఛను, సిబ్బంది జీతభత్యాల భృతి, ఆరోగ్య బీమాతోపాటు రహస్యంగా భద్రత కల్పిస్తుంది.

పింఛను

మాజీ అధ్యక్షులకు సెక్రటరీ ఆఫ్‌ ట్రెజరీ పింఛను మంజూరు చేస్తుంది. ప్రస్తుతం ఏడాదికి 2,19,200డాలర్లు(దాదాపు రూ.1.6కోట్లు) పింఛను ఇస్తున్నారు. ఇది ఎగ్జిక్యూటివ్‌ విభాగంలో ఉద్యోగుల జీతంతో సమానం. అయితే, ఏటా సమీక్ష ఆధారంగా పింఛను మొత్తంలో మార్పులు జరుగుతాయి. అధ్యక్ష పదవి నుంచి దిగిన వెంటనే పింఛను ఇవ్వడానికి జరగాల్సిన ప్రక్రియ మొదలవుతుంది. మాజీ అధ్యక్షుడి జీవిత భాగస్వామికి కూడా ఏడాదికి 20వేల డాలర్ల చొప్పున పింఛను ఇస్తారు. అయితే, మరే ఇతర చట్టబద్ధమైన పింఛన్లు వారు పొందతూ ఉండకూడదు. లేదా ఉన్న పింఛన్ను వదులుకుంటేనే ఈ 20వేల డాలర్లు చెల్లిస్తారు.

మార్పునకు ఖర్చులు..

అధ్యక్ష పదవి కాలం ముగిసిందంటే.. శ్వేతసౌధం విడిచిపెట్టి వెళ్లాల్సిందే. మరో ప్రాంతంలో సొంతగా ఏదైనా ఆఫీస్‌ ఏర్పాటు చేసుకోవడం కోసం అయ్యే ఖర్చుల్ని ప్రభుత్వమే భరిస్తుంది. అధ్యక్ష పీఠం దిగిన దగ్గర నుంచి ఏడు నెలల పాటు.. మాజీ అధ్యక్షుడి కొత్త ఆఫీసు అద్దె, టెలిఫోన్‌, ఇంటర్నెట్‌, ప్రింటింగ్‌, పోస్టల్‌ సేవలకు అయ్యే ఖర్చుల కోసం ప్రభుత్వం ఈ నిధులు కేటాయిస్తుంది.

వ్యక్తిగత ఉద్యోగులు

మాజీ అధ్యక్షులకు వ్యక్తిగతంగా కొందరు ఉద్యోగులు ఉంటారు. వారికి ఇవ్వాల్సిన జీతాలను ప్రభుత్వం జనరల్‌ సర్వీస్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం ద్వారా ఇప్పిస్తుంటుంది. ఉద్యోగుల ఎంపిక, బాధ్యత మొత్తం మాజీ అధ్యక్షులదే. అయితే, ఆ ఉద్యోగుల జీతాలు మొదటి 30 నెలలు 1.5లక్షల డాలర్లు మించకూడదు. ఆ తర్వాత 96వేల డాలర్లకు పరిమితం చేస్తారు.

ఆరోగ్య బీమా

దేశాధ్యక్షుడికే కాదు.. మాజీ అధ్యక్షులకు కూడా మిలటరీ ఆస్పత్రుల్లోనే వైద్యం అందిస్తారు. కానీ, మెనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ విభాగం నిర్ణయించిన ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. రెండుసార్లు అధ్యక్ష పదవి చేపట్టిన నేతలు ఫెడరల్‌ ఎంప్లాయి హెల్త్‌ బెనిఫిట్స్‌ ప్రోగ్రాం కింద ఆరోగ్య బీమా తీసుకోవచ్చు.

రహస్య భద్రత

దేశ అధ్యక్షుడిగా తీసుకున్న నిర్ణయాలు, చేసిన పనులు కొందరికి నచ్చకపోవచ్చు. ఈ నేపథ్యంలో వారికి శత్రువులు పెరిగే అవకాశముంది. అందుకే అధ్యక్షుడికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తారు. పదవి కాలం ముగిసిన తర్వాత కూడా వారి ప్రాణాలకు హాని ఉండొచ్చు. కాబట్టి, ప్రభుత్వం మాజీ అధ్యక్షులు, వారి కుటుంబానికి రహస్యంగా భద్రత కల్పిస్తోంది. 1965 నుంచి 1996 వరకు జీవితకాలం భద్రత కల్పించే చట్టం అమల్లో ఉండేది. 1997లో దానిని పదేళ్లకు కుదించారు. అయితే, బరాక్‌ ఒబామా దీనిని మళ్లీ జీవితకాలానికి పెంచుతూ చట్టం తీసుకొచ్చారు. 1985లో రిచర్డ్‌ నిక్సన్‌ ఈ రహస్య భద్రతను వదులుకున్నారు. అలా భద్రతను వదులుకున్న ఏకైక మాజీ అధ్యక్షుడు ఆయనే.

ప్రభుత్వం ఇచ్చే ఈ ప్రయోజనాలే కాకుండా.. మాజీ అధ్యక్షులందరూ అధికారంలో ఉండగా ఎదురైనా అనుభవాలు, జ్ఞాపకాలతో ప్రెసిడెన్షియల్‌ మెమోరైస్‌(ఆత్మకథ) రాస్తుంటారు. పలు ప్రచురణ సంస్థలు వాటి హక్కులు కొనుగోలు చేసి పుస్తకాలను మార్కెట్లో విడుదల చేస్తారు. వీటి ద్వారా మాజీ అధ్యక్షులకు కొంతమొత్తం ఆదాయం వస్తుంది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *