హైదరాబాద్: టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి చేపట్టిన రైతుభరోసా పాదయాత్ర ముగిసింది. రంగారెడ్డి జిల్లా రావిరాలలో పాదయాత్రకు ముగింపు పలికారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నుంచి రంగారెడ్డి రావిరాల వరకు 149 కి.మీ మేర పాదయాత్ర కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని రేవంత్ రైతు భరోసా పాదయాత్ర చేపట్టారు. అచ్చంపేటలో తొలుత ఈనెల 7న రేవంత్.. రాజీవ్ రైతు భరోసా దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి, ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాదయాత్ర చేయాలని రేవంత్‌ను కోరారు. దీంతో అప్పటికప్పుడు రాజీవ్ రైతు భరోసా దీక్షను పాదయాత్రగా మారుస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీంతో రేవంత్ పాదయాత్రగా బయల్దేరి ఈరోజు రావిరాల చేరుకున్నారు. అనంతరం రాజీవ్ రైతు రణభేరి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను రేవంత్ ఎండగట్టారు. ఈ సభలో కాంగ్రెస్ ముఖ్యనేతలు షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సీతక్క, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు.