రాజమండ్రి: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఏపీ మాజీ ముఖ్యమంత్రిని పోలీసులు భారీ భద్రత నడుమ రోడ్డుమార్గంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. వర్షం కురుస్తుండటంతో విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి రాజమహేంద్రవరం చేరుకోవడానికి 5 గంటలకు పైగా పట్టింది. కోర్టు ఆదేశాల మేరకు బాబు కోసం జైలు అధికారులు స్నేహ బ్లాక్ ప్రత్యేక గదిని సిద్ధం చేశారు. ఆయనకు ఖైదీ నంబర్ 7691 కేటాయించారు. జైలు దగ్గర 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, చంద్రబాబుకు ఇంటి భోజనంతోపాటు మందులు ఇవ్వడానికి కోర్టు అనుమతించింది. భద్రతా కారణాల వల్ల మిగతా ఖైదీలతో కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. అయితే బాబుకు బెయిల్ కోసం ఆయన లాయర్లు ప్రయత్నిస్తున్నారు. ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేసింది. ఇక బాబును విచారణ నిమిత్తం జ్యుడీషియల్ రిమాండ్‌కు అప్పగించాలని సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బాబు అరెస్టు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం ఏసీబీ కోర్టు ఎదుట చంద్రబాబును ప్రవేశపెట్టిన సీఐడీ 28 పేజీల రిమాండ్ రిపోర్టును సమర్పించింది. ఈ కేసులో 2021లో ఎఫ్ఐఆర్ నమోదు అయిందని, విచారణ నిమిత్తం చంద్రబాబును 15 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు వాదనలు కొనసాగాయి. ఇరువర్గాల వాదనలు విన్న సీబీఐ కోర్టు న్యాయమూర్తి.. చివరకు సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో చంద్రబాబుకు 14 రోజు ల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు.