Breaking News

ఉపఖండానికి గంపెడు పేర్లు

  • యుగానికో పేరుతో పిలువబడిన దేశం
  • కౌటిల్యుడి అర్థశాస్త్రంలో జంబూద్వీపం
  • మహాభారత కాలంలో ఆర్యావర్తనం
  • రుగ్వేద కాలంలో భరత వర్ష
  • మెలూహగా పిలిచిన సుమేరియన్లు
  • సింధును హిందూ చేసిన పర్షియన్లు
  • ఇండియాగా పలికిన యూరోపియన్లు

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 10: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశం పేరును అనధికారికంగా మార్చేయటంతో ఎక్కడ చూసినా ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తున్నది. ప్రధానిమోదీ దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అధికారిక కార్యక్రమాల్లో ఇండియాకు బదులుగా భారత్‌ అని దేశం పేరు కనిపిస్తున్నది. నిన్న ముగిసిన జీ 20 సమావేశాల్లోనూ మోదీ సీటు ముందు భారత్‌ అనే నేమ్‌ బోర్డే కనిపించటంతో దేశం పేరును కేంద్రప్రభుత్వం మార్చేసిందని అందరికీ స్పష్టత వచ్చిం ది. కానీ, అధికారికంగా మాత్రం కేంద్రం దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయినా, రాజకీయ నాయకుల నుంచి సినిమా సెలబ్రిటీల వరకు, మేధావుల నుంచి సామాన్యు డి వరకు ఎక్కడ చూసినా దేశం పేరు మార్పుపైనే చర్చ నడుస్తున్నది. మరి ఈ దేశాన్ని పూర్వకాలంలో నిజంగా భారత్‌ అనే పిలిచేవారా? ఇండియా అనే పేరు ఎందుకు స్థిరపడింది? అసలు ఈ భూమికి చారిత్రకంగా ఎన్నిపేర్లు ఉన్నాయి?

యుగానికో పేరు

ఇండియా అని నేడు ప్రపంచమంతా సంబోధిస్తున్న ఈ భూమికి క్రీస్తుకు పూర్వం 5-6 వేల సంవత్సరాల నుంచి కాలక్రమానుగతంగా అనేక పేర్లు వాడుకలో ఉండేవని చరిత్రకారులు చెప్తున్నారు. ఉపఖండంలో మొట్టమొదటి నాగరికత అయిన హరప్పా నాగరికతను నాడు ఏమని పిలిచేవారనేదానిపై చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం లేదు. అయితే, ఈ నాగరికతతో విస్తృతమైన వ్యాపార సంబంధాలు నెరపిన మెసపటోమియా (నేటి ఇరాక్‌) నాగరికతలోని సుమేరియన్లు మాత్రం ఈ ప్రాంతాన్ని ‘మెలూహ’ అని పిలిచేవారని చరిత్రకారులు గుర్తించారు. సుమేరియన్ల క్యూనిఫారం మట్టిపలకల్లోని రాతల్లో హరప్పా ప్రాంతాన్ని మెలూహ అని సంబోధించారు. ఈ మట్టిపలకలు క్రీస్తుకు పూర్వం 5-6 వేల సంవత్సరాల కాలం నాటివి. హరప్పా నాగరికత ప్రస్తుత పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌తోపాటు భారత్‌లోని గుజరాత్‌, రాజస్థాన్‌, హర్యానా, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్ముకశ్మీర్‌ ప్రాంతాల వరకు విస్తరించింది. కానీ, మెలూహ పేరుతో దక్షిణ, తూర్పు భారతదేశానికి సంబంధం లేదని చరిత్రకారుల వాద. అయితే, హరప్పా నాగరికతను స్థానిక ప్రజలు ఏ పేరుతో పిలుచుకొనేవారో మాత్రం ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారు.

వేదకాలంలో భరత వర్ష

క్రీసుకుపూర్వం 1500 కాలం నాటిదిగా చెప్తున్న రుగ్వేదంలో ఈ ప్రాంతాన్ని భరత వర్ష అని సంబోధించారు. భరత తెగ విస్తరించిన ప్రాంతాన్ని ఈ పేరుతో పిలిచారని చెప్తున్నారు. మహాభారత కాలంలో కూడా ఈ పేరునే వాడారు. అయితే, ఈ భరత తెగ ప్రస్తుత పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ పశ్చిమప్రాంతం, కశ్మీర్‌ వరకే నాడు పరిమితమైంది. అంటే ఆ ప్రాంతాన్ని మాత్రమే భరత వర్ష అని పిలిచేవానే వాదనా ఉన్నది. ఇదే సమయంలో ఆర్యులు విస్తరించిన ఉత్తర, పశ్చిమ ప్రాంతాన్ని కలిపి ఆర్యావర్తనం అని పిలిచారు. మనుస్మృతి, పురాణాల్లో ఆర్యావర్తనమనే ఎక్కువగా సంబోధించారు. ఈ ప్రాంతం నేటి గుజరాత్‌ నుంచి మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, బెంగాల్‌ను కలుపుతూ హిమాలయాల దక్షిణ ప్రాంతాలు, కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానాతోపాటు అఫ్గాన్‌ సరిహద్దు వరకు విస్తరించి ఉండేదని చరిత్రకారులు వెల్లడించారు. ఆర్యావర్తనంలో ద్రవిడ ప్రాంతం లేదు. ‘ద్రవిడ’ పదం ‘ద్రవ్య’, ‘విడ’ అనే రెండు పదాల కలయిక. ద్రవ్య అంటే ‘నీరు’, విడ అంటే ‘కలిసే చోటు. హిందూమహా సముద్రం, అరేబియా సముద్రం బంగాళాఖాతం కలిసే ప్రాంతాన్ని ‘ద్రవిడ’ ప్రాంతం అని పిలిచారు. ప్రస్తుతం ఇది దక్షిణ భారతదేశం. ఆ తర్వాత కాలంలో భిన్న ప్రాంతాల్లో భిన్న పేర్లతో ఈ భూమి పిలువబడింది. ‘నభివర్ష, ఇలావతి వర్ష’ పేర్లు కూడా వాడుకలో ఉండేవని చరిత్రకారులు గుర్తించారు.

పర్షియన్లతోనే హిందూ నామం

హిందుస్థాన్‌ అనే పేరు ఎలా వచ్చిందన్నదానిపై అనేక వాదనలున్నాయి. చాలామంది అంగీకరించే వాదన సింధూ నది పేరు మీదనే హిందుస్థాన్‌ అని వచ్చింది. పర్షియన్లు మొదటిసారి సప్తసింధుపై దాడిచేసిన సమయంలో సింధూ నదిని వారు పొరపాటున హిందూ నది అని పిలిచారని, అలా హిందూ పదం వాడుకలోకి వచ్చిందనేది కొందరి వాదన. సింధూ ప్రాంతంలో నివసించే ప్రజలను హిందువులన్నారని, వారు అనుసరించే మతాన్ని హిందూమతమని, వారు నివసించే ప్రాంతాన్ని హిందుస్థాన్‌ అన్నారని కొందరు సూత్రీకరిస్తున్నారు. పర్షియన్ల తర్వాత వచ్చిన అఫ్గాన్లు, మొఘలులు కూడా ఈ ప్రాంతాన్ని హిందుస్థాన్‌ అనే పిలిచారు.

‘ఇండియా’ఎలా వచ్చింది ?

క్రీస్తుకు పూర్వం 326లో భారత్‌పై దండెత్తివచ్చిన గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్‌ సింధూనదిని ఇండస్‌ అన్నాడు. ఆ ప్రతినిధిగా ఆఫ్ఘనిస్థాన్‌ను పాలించిన సెల్యూకస్‌ నికెటర్‌ 1, ఆ సమయంలో మగధను పాలిస్తున్న చంద్రగుప్త మౌర్యుడి వద్దకు మెగస్తనీస్‌ అనే వ్యక్తిని రాయబారిగా పంపాడు. అతడు చంద్రగుప్తుడి ఆస్థానంలోనే ‘ఇండికా’ అనే గ్రంథాన్ని రాశాడు. ఈ పేరుతోనే ‘ఇండియా’ అనే పేరు వచ్చిందని కొందరి వాదన. యూరోపియన్ల రాక మొదలైన తర్వాత ఇండియా పేరు అమితంగా ప్రచారంలోకి వచ్చింది. భారతీయ పురాణ గ్రంథాల్లో మాత్రం ఎక్కడా ఇండియా అనే పేరు కనపడదు. బ్రిటిష్‌ పాలన అంతమైన తర్వాత భారత రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో దేశానికి ఏ పేరు ఉండాలన్న అంశంపై తీవ్రంగానే చర్చ జరిగింది. కొందరు భారత్‌, హిందుస్థాన్‌, హిందుస్థానీ అని ఉండాలని ప్రతిపాదించారు. మరికొందరు ఇండియా పేరే బాగా ప్రచారంలో ఉన్నదికాబట్టి అదే పేరు ఉండాలని పట్టుబట్టారు. మధ్యేమార్గంగా ‘ఇండియా, దటీజ్‌ భారత్‌, షల్‌ బీ ఏ యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌’ అని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1లో చేర్చారు. అయితే, ఇండియా పేరు ఈ భూమి చరిత్ర, సంస్కృతికి సంబంధించినది కాదని వాదిస్తున్న బీజేపీ, తాజాగా భారత్‌గా మార్చేసింది.

కౌటిల్యుడు చెప్పిన జంబూద్వీపం

కౌటిల్యుడి‘అర్థశాస్త్రం’లో నేటి భారతదేశాన్ని మొత్తాన్ని కలిపి ఒక పేరుతో ఆయన సంబోధించారు. బహుశా హిమాలయాల నుంచి త్రిసముద్ర మధ్యప్రాంతాన్ని మొత్తాన్ని కలిపి పిలిచిన మొదటి పేరు అదేనని చరిత్రకారుల వాదన. ఆ పేరే ‘జంబూద్వీపం’. నేడు హిందువులు పూజల సమయంలో వల్లెవేసే మంత్రాల్లో కూడా ‘జంబూద్వీపే’ అని పలుకుతుంటారు. జంబూద్వీపమంటే హిమాలయాల నుంచి బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం మధ్య ప్రాంతమని కౌటిల్యుడు వివరించారు. కౌటిల్యుడు క్రీస్తుకు పూర్వం 200 సమయంలో జీవించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *