తెలుగు తేజం, గుడివాడ : గుడివాడ- కంకిపాడు రహదారి విస్తరణ పనులను రూ.16.10 కోట్లతో త్వరలో ప్రారంభిస్తామని కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆర్ అండ్ బీ, రెవెన్యూ, పురపాలక శాఖ అధికారులతో కలసి గుడివాడ-కంకిపాడు రహదారిని ఆయన పరిశీలించారు. గుడివాడ నుంచి పెదపారుపూడి అడ్డరోడ్డు వరకు పది మీటర్ల వెడల్పుతో రహదారి నిర్మాణంతో పాటు కాలువకు రివిట్మెంట్ పనులు చేసేందుకు రూ.16.10 కోట్లు మంజూరు అయ్యాయని కలెక్టర్ తెలిపారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు. అక్కడి నుంచి కంకిపాడు వరకు రహదారి నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేసి ఎన్డీబీకి ప్రతిపాదనలు పంపామన్నారు. త్వరలో గుడివాడ నుంచి కంకిపాడు వరకు ఉన్న 21 కిలో మీటర్ల రహదారి పనులను ప్రారంభించి పూర్తి చేస్తామని కలెక్టరు తెలిపారు. రహదారి విస్తరణలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆర్ అండ్ బీ అధికారులు తన దృష్టికి తెచ్చారని, వచ్చే వారంలో ఫారెస్ట్, విద్యుత్ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు. కలెక్టరు వెంట ఆర్అండ్బీ డీఈ జేమ్స్, తహసీల్దార్ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్ పాల్గొన్నారు.