అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడంపై అధికారులకు ఆదేశాలు
విజయవాడ : అసైన్డ్ భూములపై పూర్తిస్థాయిలో యాజమాన్య హక్కులు కల్పించేందుకు లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్ అధికారులను ఆదేశించారు. అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించే విషయంలో అర్హులైన లబ్ధిదారుల జాబితాను ఖరారు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్.. సబ్ కలెక్టర్ అదితిసింగ్తో కలిసి తిరువూరు, నందిగామ ఆర్డీవోలు, అన్ని మండలాల తహసీల్దార్లతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా 2023, జులై 31 తేదీ ప్రామాణికంగా హక్కులు దఖలు పరచనున్నట్లు తెలిపారు. 20 సంవత్సరాలు ముందు పట్టాలు పొందిన వ్యవసాయ భూములకు యాజమాన్య హక్కులు కల్పించనున్నట్లు వివరించారు. దీనికి సంబంధించి లబ్ధిదారుల జాబితా రూపకల్పనకు అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో అధికారులు పనిచేయాలని ఆదేశించారు. వీఆర్వోలు, తహసీల్దార్లతో జిల్లాస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అసైన్డ్ భూముల్లో వ్యవసాయ భూములు, లబ్ధిదారుల వివరాలతో పూర్తిస్థాయిలో నివేదికలు సమర్పించాలన్నారు. 22 ఏ కు సంబంధించి పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ ఆదేశించారు. సమావేశంలో నందిగామ ఆర్డీవో పి.సాయిబాబా, తిరువూరు ఆర్డీవో కె.మాధవి తదితరులు పాల్గొన్నారు.