- వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య
- విజయవాడలో పట్టించుకోని సైబర్ క్రైమ్ పోలీసులు
తెలుగు తేజం బ్యూరో:తెలంగాణలో, ఆంద్రప్రదేశ్ లో ఆన్లైన్ లోన్ యాప్‌ల నిర్వాహకుల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. పోలీసులు దాడులతో కొన్నాళ్ల పాటు ఆగిన వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. యాప్‌ల ద్వారా లోన్లు తీసుకుంటున్న వారికి ఫోన్లు చేస్తూ వేధిస్తున్న నిర్వాహకులు.. అంతటితో ఆగకుండా వారి స్నేహితులు, బంధువులకు సైతం ఫోన్లు చేసి పరువు తీస్తున్నారు. తాజాగా ఆన్లైన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది.
జియాగూడకు చెందిన రాజ్‌కుమార్ అనే యువకుడు ఆన్లైన్ లోన్ యాప్ ద్వారా రూ.12వేలు లోన్ తీసుకున్నాడు. యాప్ రిజిస్ట్రేషన్ సమయంలో రిఫరెన్స్ కాంటాక్ట్స్‌గా తన స్నేహితుల ఫోన్ నంబర్లు ఇచ్చాడు. తొలి వాయిదాగా రూ.4వేలు చెల్లించగా.. మొత్తం ఒకేసారి చెల్లించాలని నిర్వాహకులు వేధించారు. తనవద్ద డబ్బులు లేవని కొద్దిరోజులు ఆగాలని చెప్పినా వినకుండా అతడి స్నేహితులకు ఫోన్లు చేసి దుర్భాషలాడారు. దీంతో పాటు అతడి కాంటాక్ట్ లిస్ట్‌లోని నంబర్లకు మెసేజ్‌లు పంపించారు. దీంతో పరువు పోయిందని మనస్తాపానికి గురైన రాజ్‌కుమార్ సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
లోన్ యాప్ నిర్వాహకులు తక్కువ వడ్డీ అని చెప్పి సోషల్ మీడియాలో యాడ్ రూపంలో యువత ను బురిడీ కొట్టించి లోన్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకునే విధంగా ఆకట్టుకుంటారు.దీంతో సదరు బాధితులు తక్కువ వడ్డీ అని లోన్ కు సంబంధించిన అన్ని ఆధారాలతో రిఫరెన్స్ నంబర్ లు కూడా ఇస్తారు.కాని లోన్ యాప్ లో చూపించినట్టుగా జరగదు.కేవలం 4రోజుల్లోనే 4వేలకి 8వేలు డబుల్ మనీ కట్టాలని లేని యెడల మీ టోటల్ కాల్ లిస్ట్ కు మీ గురించి చెబుతామని వేధింపులు గురి చేస్తూ మానసికంగా హింసించడంతో తెలుగు రాష్ట్రాల్లో బాధితుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది.
విజయవాడలో:విజయవాడలో సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో రోజు రోజు కు భాదితుల సంఖ్య పెరిగిపోవడం తో ఫిర్యాదులను తీసుకోవద్దని చెబుతున్నారని బాధితుల సమాచారం. ఇలాంటి కేసులు వచ్చినప్పుడు “బాధితులను ఎందుకు తీసుకున్నారు.అప్పో సప్పో చేసి కట్టేయండి అని, ఇలాంటివి మా సిఐ గారు తీసుకోవద్దని” పోలీసులు బయట నుండే భాదితులను వెళ్లగొడుతున్నారని బాధితుల సమాచారం. చేసేదేమీ లేక అప్పులు తెచ్చి లోన్ యాప్ లను లోన్లు కట్టి చేతులను కాల్చుకున్నట్లు వాపోతున్నారు.లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు కొద్ది నెలల ముందు లోన్ యాప్ సంస్థలపై దాడులు చేయడంతో ఈ దందాకు కొంతకాలం తెరపడింది. తాజాగా మళ్లీ వెలుగులోకి వచ్చిన లోన్ సంస్థలు రుణ గ్రహీతలకు ఫోన్లు, మెసేజ్‌లు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నాయి. పోలీసుల వీరిపై చర్యలు సరైన చర్యలు తీసుకోకపోతే మరికొంత అమాయకులు ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.