విశాఖ: విశాఖ సాగరతీరం మరోసారి నల్లగా మారిపోయింది. సముద్రంలో నుంచి బొగ్గు పొడి గుట్టలుగా కొట్టుకొచ్చిందా అన్నట్టుగా ఆర్కే బీచ్‌లోని ఇసుక నలుపు వర్ణంలోకి మారిపోయింది. ఇది చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సాయంత్రం అయ్యిందంటే చాలు వైజాగ్ బీచ్‌కు చేరుకుని సరదాగా కాలక్షేపం చేసే ప్రజలు.. నల్లగా మారిన ఇసుకను చూసి బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో కాలుష్యం కారణంగానే ఇసుక నల్లగా మారుతుందా అనే చర్చ ఇప్పుడు మొదలైంది. స్థానికులు మాత్రం విశాఖలో మొత్తం 10 ప్రాంతాల్లో డ్రైన్ వాటర్ వచ్చి సముద్రంలో కలుస్తున్నాయని ఆరోపిస్తున్నారు. అందుకే బీచ్ అందం మొత్తం పాడైపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రంగు మారడానికి కారణమిదేనా?
వాస్తవానికి విశాఖపట్నంలోని సముద్రతీరం ఇలా ఇసుక నల్లగా మారడం ఇది కొత్తేమీ కాదు. గత ఏడాది రాఖీ పౌర్ణమి తర్వాత ఆగస్టు 11వ తేదీన కూడా ఇలాగే జరిగింది. దీంతో వైజాగ్ బీచ్‌కు ఏదైనా ప్రమాదం పొంచి ఉందేమోనని అంతా హడలెత్తిపోయారు. కానీ ఇది ఆందోళన చెందాల్సిన విషయం కాదని అప్పుడే శాస్త్రవేత్తలు సూచించారు. ఏ తీర ప్రాంతంలో అయితే ఇనుప ధాతువు ఎక్కువగా కలిగి ఉంటాయో అక్కడ ఇసుక నల్లగా మారుతుందని ఆంధ్రా యూనివర్సిటీ సముద్ర గర్భ అధ్యయన శాస్త్ర విభాగం రిటైర్డ్ ప్రొఫైసర్ ప్రసాదరావు గతంలో వివరించారు. వందల ఏళ్లుగా తీరం నుంచి కొట్టుకొచ్చిన ఎర్రని మట్టి, ఇసుకతో మేటలు వేసి భీమిలి సమీపంలోని ఎర్రదిబ్బలు ఏర్పడినట్లే.. ఇక్కడ నల్లటి మేటలు వేస్తుందని.. అయితే ఈ ఇసుక చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది కాబట్టి అలలే ఆ మట్టిని మళ్లీ సముద్రంలోకి తీసుకెళ్తాయని చెప్పారు. తీరానికి సమీపంలో అగ్నిపర్వతాలు, ఖనిజాల గనులు ఉన్నా కూడా తీరంలోని ఇసుక ఆయా రంగులను సంతరించుకుంటుందన్నారు. కాబట్టి విశాఖ బీచ్‌లో ఇసుక నల్లగా మారడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.