ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ బ్రోచర్‌ను విడుదల చేసిన సీఎం జగన్
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్షపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఆర్డీఏపై కూడా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ రూపొందించిన బ్రోచర్‌ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా అనే అంశంపై ఈ బ్రోచర్లో వివరించారు. సెప్టెంబర్ 30 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అధికారుల సమీక్షలో సీఎం జగన్ ప్రకటించారు. జగనన్న సురక్ష తరహాలోనే ఈ ఆరోగ్య సురక్షని కూడా చేపట్టాలన్నారు. సురక్ష తరహాలో ప్రతి ఇంటికి వెళ్లి, వారి సమస్యలను తెలుసుకోవాలి. ఒక నిర్ణీత రోజున వారికి మంచి జరిగేలా హెల్త్ క్యాంపు నిర్వహించాలి. సురక్ష ద్వారా ప్రతి ఇంట్లో జల్లెడ పట్టి.. ఆరోగ్య సమస్యలను తెలుసుకోవాలి. వాటికి పరిష్కారమిచ్చే గొప్ప బాధ్యతను మనం తీసుకుంటున్నాం” అని సీఎం పేర్కొన్నారు. ఈ సమీక్షలో మంత్రి విడదల రజని, సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.