ప్రకటించిన టైమ్ మ్యాగజైన్
న్యూయార్క్: భారతీయ మూలాలున్న వాషింగ్టన్ డీసీ నివాసి రాహుల్ దూబె, ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రకటించిన ‘హీరోస్ ఆఫ్ 2020’ జాబితాలో ఒకరిగా నిలిచారు. ఎలాంటి ముఖ పరిచయం లేకపోయినా అవసరంలో ఉన్నవారికి ఆశ్రయం కల్పించింనందుకే ఆయనకు ఈ గౌరవం దక్కినట్టు టైమ్ పత్రిక తెలిపింది. వీరందరూ నిజమైన హీరోలని.. అత్యవసర పరిస్థితుల్లో అంచనాలకు మించి సేవలందించారని సంస్థ ప్రశంసించింది.
మానవత్వానికే పెద్ద పీట
పోలీసుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా నగరంలో వేల మంది ప్రదర్శనలు జరిపారు. రాత్రి కర్ఫ్యూ ప్రారంభం కావటంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పలువురికి నిలువనీడ కరవైంది. మరోవైపు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిరసనకారులపై పెప్పర్ స్ప్రేలు, లాఠీ ఛార్జిలు దిగారు. ఈ క్రమంలో ఎటు పోవాలో పాలుపోని వారికి.. రాహుల్ దూబె తన ఇంటిలో ఆశ్రయమివ్వటంతో పాటు, ఆహారం తదితర అత్యవసరాలను కూడా అందజేశారు. పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలకు వెరవకుండా మానవత్వానికే పెద్ద పీట వేశారు. కళ్లముందు జరుగుతున్న దానిని చూస్తూ ఊరుకోలేక తాను ఆ విధంగా చేసినట్టు దూబె తెలిపారు.
వీరందరూ హీరోలే..
కార్చిచ్చు నుంచి తమ దేశాన్ని కాపాడుకునేందుకు ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడిన అస్ట్రేలియా అగ్నిమాపక వాలెంటీర్లు; కొవిడ్ కాలంలో సింగపూర్‌లో పలువురికి ఆహారం అందించిన హోటల్ యజమానులు జేసన్ చౌవా, హంగ్ ఝెన్ లాంగ్; క్లిష్ట పరిస్థితుల్లో తమ చర్చిని సహాయక శిబిరంగా మార్చిన చికాగో పాస్టర్ రిషోర్నా ఫిట్జ్‌పాట్రిక్, ఆమె భర్త బిషప్ డెరిక్ ఫిట్జ్‌పాట్రిక్; న్యూజెర్సీలో అవసరంలో ఉన్న140 కుటుంబాలకు దినపత్రికతో సహా అత్యవసర వస్తువులు అందించిన పేపర్ బాయ్ గ్రెగ్ డైలీ తదితరులు కూడా టైమ్స్ హీరోస్ ఆఫ్ 2020 జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.