సూక్ష్మ, చిన్న, మధ్య తరహా స్టార్టప్ సంస్థల ఏర్పాటుకు రూ.10లక్షల వరకూ సబ్సిడీ..
ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు.. అమరావతే రాజధానిగా కొనసాగింపు..
అమరావతే రాజధానిగా కొనసాగింపు..
పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం
అమరావతి : టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ – జనసేన మేనిఫెస్టో కమిటీ భేటీలో కీలక అంశాలపై నేతలు చర్చించారు. ఉమ్మడిగా మినీ మేనిఫెస్టో తెలుగుదేశం – జనసేన పార్టీలు ప్రకటించాయి. మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, పట్టాభి.. జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కుమార్ ఉన్నారు. భేటీ ముగిసిన అనంతరం మీడియా సమావేశంలో ఇరు పార్టీల నేతలు వివరాలను వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ నుంచి 6 అంశాలు, జనసేన నుంచి ప్రతిపాదించిన 5 అంశాలను చేర్చి ఉమ్మడిగా 11 అంశాలతో కూడిన మినీ మేనిఫెస్టోను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సభ్యుడు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. తెలుగుదేశం – జనసేన కలిసి 11అంశాలతో మినీ మేనిఫెస్టోకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. తెలుగుదేశం సూపర్ 6 పథకాలకు తోడు జనసేన ప్రతిపాదించిన 5 అంశాలకు అంగీకారం తెలిపిందని చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా స్టార్టప్ సంస్థల ఏర్పాటుకు రూ.10లక్షల వరకూ సబ్సిడీ.. ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు.. అమరావతే రాజధానిగా కొనసాగింపు.. పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం వంటివి కొత్తగా మినీ మేనిఫెస్టోలో చేర్చామన్నారు. మ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై ప్రాథమికంగా చర్చించామన్నారు. టీడీపీ నుంచి సూపర్ సిక్స్ పేరుతో మినీ మేనిఫెస్టోపై ప్రజల్లోకి వెళ్తున్నామని యనమల తెలిపారు. రాష్ట్రంలో సమస్యలు చాలా ఉన్నాయన్న యనమల.. వివిధ వర్గాలకు ఇప్పటి వరకు లేని సమస్యలను జగన్ సృష్టించారన్నారు. ఈ సమస్యలను పరిష్కరించే అంశాలూ ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తామని.. తుది మేనిఫెస్టో విడుదల చేసే ముందు వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో చర్చిస్తామన్నారు. ఈ మీటింగ్ విశేషాలను పార్టీ అధినాయకత్వాల దృష్టికి తీసుకెళ్తామన్నారు. సౌభాగ్యపదం పేరుతో యువత వ్యాపారాలు చేసుకునేందుకు ఆర్థిక సాయం అందించే అంశాన్ని జనసేన ప్రతిపాదించిందని యనమల రామకృష్ణుడు చెప్పారు. సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్రాభివృద్ధికి పెద్ద పీట వేసేలా ప్రణాళికలు రచిస్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లులా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన చేస్తామని ఆయన పేర్కొన్నారు. అసమానతలు తొలిగి ఆర్థిక వ్యవస్థ బాగుపడేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సభ్యుడు ముత్తా శశిధర్ మాట్లాడుతూ.. జనసేన వైపు నుంచి ఆరు ప్రతిపాదనలు పెట్టామన్నారు. యువతకు, మహిళలకు పవన్ కొన్ని హామీలిచ్చారని.. అలాగే వివిధ వర్గాలకు వారాహి యాత్రలో పవన్ హామీలిచ్చారని వెల్లడించారు. మేం ప్రతిపాదించిన కొన్ని అంశాలు టీడీపీ ప్రతిపాదించిన అంశాల్లోనూ ఉన్నాయన్నారు. సీపీఎస్ రద్దు అంశంపై ఉద్యోగ సంఘాల వాళ్లతో చర్చిస్తామని వెల్లడించారు.