తెలుగు తేజం, అమరావతి: ఫుట్‌పాత్‌లు, వీధుల్లో వస్తువులు, తినుబండారాలు విక్రయించే చిరు వ్యాపారులకు రూ.10 వేల చొప్పున రుణాలు అందించే ‘జగనన్న తోడు’ పథకాన్ని ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్ కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పథకం కింద బ్యాంకుల నుంచి చిరు వ్యాపారులకు రుణాలు ఇప్పించడంతోపాటు ఆ రుణాలపై అయ్యే వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది.
తీసుకున్న రుణాన్ని మాత్రం వాయిదాల పద్ధతిలో లబ్ధిదారులు చెల్లిస్తే సరిపోతుంది. ఫుట్‌పాత్‌లు, వీధుల్లో తోపుడు బండ్లు, సైకిళ్లపై వివిధ వస్తువులు, కూరగాయలు, పండ్లు, అమ్ముకుని జీవనం సాగించే వారితోపాటు రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నడిపే వారు, గంపలు లేదా బుట్టలపై వివిధ వస్తువులు అమ్ముకునే వారంతా ఈ పథకం కింద లబ్ధి పొందనున్నారు. సంప్రదాయ వృత్తులైన ఇత్తడి పని చేసే వారు, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కలంకారీ, తోలు బొమ్మల అమ్మకందారులతో పాటు కుమ్మరి వారికి సైతం ఈ పథకం కింద రుణాలు ఇస్తారు.