న్యూఢిల్లీ : దక్షిణాదిన కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలనుందా..? తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీనటి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ కుష్బూ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి కుష్బూ బీజేపీ గూటికి చేరబోతున్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో సోమవారం మధ్యాహ్నం ఆమె కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఇప్పటికే హస్తినకు చేరుకున్న కుష్బూ బీజేపీ పెద్దలను సైతం కలిశారని, వారుకూడా స్వాగతం పలికారని సమాచారం. మరోవైపు సీనియర్ నేతను బుజ్జగించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఆమెకు తమిళనాడు కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్ష పదవిని కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
2010లో అప్పటి అధికార పార్టీ డీఎంకేలో చేరిన కుష్బూ 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గూటికి చేరారు. రాష్ట్రంలో, కేంద్రంలోనూ అధికారానికి దూరంగా ఉండటంతో ఆమెకు ఎలాంటి పదవీ దక్కలేదు. ఈ క్రమంలోనే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుపట్టారు. కానీ డీఎంకే-కాంగ్రెస్ పొత్తు నేపథ్యంలో సీట్లు సర్దుబాటు కారణంగా ఆమెకు ఎంపీ టికెట్ దక్కలేదు. అయితే ఆ తరువాత రాజ్యసభకు పంపుతామని అనేకసార్లు హామీ ఇచ్చినప్పటికీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. పురుషాధిక్యత కలిగిన కాంగ్రెస్‌లో ఆత్మాభిమానం మెండుగా కలిగిన కుష్బూ పార్టీలో ఇమడలేని పరిస్థితులు చుట్టుముట్టాయి. అధిష్టానంలో రాహుల్‌గాంధీ ఆశీస్సులు ఉన్నా గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో టికెట్ పొందలేక పోటీచేయలేక పోయారు. కాంగ్రెస్, డీఎంకే కూటమిగా కొనసాగడం, గతంలో డీఎంకేతో విభేదించి కాంగ్రెస్‌లో చేరడం వల్లనే డీఎంకే ముఖ్యనేత ఒకరు కుష్బూకు అడ్డుతగిలినట్లు సమాచారం.