విజయవాడ : రాష్ట్రంలోని భారీ వర్షాలపై ఏపీ విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు మాట్లాడుతూ, ఇది డీప్ డిప్రెషన్ మాత్రమేనని, తుఫానులా మారలేదని చెప్పారు. ఫలితంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రస్తుతం కాకినాడ ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని, రాగల మూడు నాలుగు గంటలు పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరుల మీదుగా వర్షాలు తెలంగాణా వైపు వెళతాయన్నారు. ప్రస్తుతం గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల మేర గాలులు వీస్తున్నాయన్నారు.
తీర ప్రాంతంలో 60 నుంచి 65 కిలో మీటర్ల వేగం ఉండొచ్చు అని తెలిపారు. అన్ని జిల్లాల్లో సహాయకచర్యలు అందించడానికి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మంగళగిరిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సర్వం సిద్ధం చేసుకొని ఉన్నాయని తెలిపారు. రెండు రోజుల క్రితమే కాకినాడకు ఒక ప్లటూన్ ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపామని వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నానానికి ఏపీలో వర్షాలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.