Breaking News

ట్రంప్‌ రాకతో వేడెక్కిన ప్రచారం!

వాషింగ్టన్‌: కరోనా చికిత్స అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సోమవారం తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రత్యర్థి డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌పై విరుచుకుపడ్డారు. సామ్యవాద, మార్క్సిస్టు, లెఫ్ట్‌ భావజాల అతివాదులకు పార్టీని అప్పుజెబుతానని అంగీకరించి బైడెన్‌ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్నారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. బైడెన్‌ అధికారంలోకి వస్తే ర్యాడికల్‌ లెఫ్ట్‌ గ్రూపులే అమెరికాను ఏలుతాయని వ్యాఖ్యానించారు. అప్పుడు అమెరికాను తిరిగి గాడిన పెట్టడం అసాధ్యం అని పేర్కొన్నారు. తాను రాజకీయ నాయకుడినే కాదని.. తనకు ఆ పదం వింటేనే మొహమాటంగా ఉందని వ్యాఖ్యానించారు. తాను ఏమాత్రం వయసు మళ్లిన వ్యక్తిని కాదన్నారు. ఇంకా శక్తిమంతంగా తయారవుతానన్నారు. తనలో అనారోగ్యం ఏమాత్రం లేదని.. తనకు మద్దతు తెలపడానికి వచ్చిన ప్రతిఒక్కరినీ ‘ముద్దు పెట్టుకోవాల’ని ఉందని వ్యాఖ్యానించారు. ఫ్లోరిడాలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు.. ట్రంప్‌ కరోనా నుంచి కోలుకున్నారని శ్వేతసౌధం వైద్యుడు డాక్టర్‌ సియాన్‌ కాన్లే వెల్లడించారు. ఆయనకు నిర్వహించిన వరుస యాంటిజెన్‌ పరీక్షల్లో నెగెటివ్‌గా తేలినట్లు తెలిపారు. ట్రంప్‌ మహమ్మారి ముప్పు నుంచి బయటపడ్డట్లు.. ఆయన నుంచి ఇతరులకు వైరస్‌ సోకే ప్రమాదం లేదని కాన్లే శుక్రవారమే వెల్లడించారు. దీంతో ఆయన బహిరంగ సమావేశాల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. శనివారం తన మద్దతుదారులతో శ్వేతసౌధంలో ఓ సమావేశం నిర్వహించారు. నేడు నేరుగా తన పార్టీ మద్దతుదారులతో ఫ్లోరిడాలో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. సభకు వచ్చిన వారిలో చాలా మంది మాస్కులు ధరించకపోవడం గమనార్హం.

ట్రంప్ రాకతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అటు ప్రత్యర్థి డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ సైతం ట్రంప్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్రంప్‌ విలువల్లేని రాజకీయాలకు పాల్పడుతున్నారని.. అమెరికా ప్రజల్ని విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తిరిగి దేశ రాజకీయ స్ఫూర్తిని పునరుద్ధరించాల్సి అవసరం ఉందన్నారు. భయంపై ఆశను, కాల్పనితపై శాస్త్రీయతను, విభజనపై ఐక్యతను, అసత్యంపై సత్యాన్ని గెలిపించాల్సిన బాధ్యత అమెరికా ఓటర్లపై ఉందన్నారు. కరోనా కట్టడిలో ట్రంప్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. స్వయంగా అధ్యక్షుడే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇంకా ఆయనే ఆ పదవిలో కొనసాగితే పాలనా యంత్రాంగం మొత్తం నిర్లక్ష్యంగా తయారవుతుందన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *