తెలుగు తేజం , విజయవాడ : వాట్సప్‌లో రూ.10 నోటు బొమ్మపై నంబరును కోడ్‌గా సరిచూసుకుని, రూ.35 లక్షలు మార్చుకుంటుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ భవానీపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుందీ ఘటన. హవాలా ద్వారా నగదు మార్చుకుంటున్నట్లు తెలిసి టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏసీపీ వర్మ, సీఐ కృష్ణమోహన్ సిబ్బందితో దాడులు చేశారు. రాజస్థాన్‌కు చెందిన సత్యేంద్రసింగ్ ఈ హవాలా సూత్రధారి. భవానీపురానికి చెందిన రావి వెంకటనారాయణ రూ.35 లక్షల్ని సత్యేంద్రసింగ్‌కు ఇచ్చాడు. ఆ నగదును గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన సత్యనారాయణకు అందివ్వాలి. రాజ్‌స్థాన్ వాసి పప్పుసింగ్ రహస్య కోడ్‌ను సత్యనారాయణకు పంపాడు. వాట్సప్‌లో రూ.10 నోటు బొమ్మపై ఉన్న నంబరును కోడ్‌గా సత్యేంద్రసింగ్‌కు చూపితే అతను డబ్బు ఇస్తాడు. భవానీపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని పి.ఆర్.కె. బిల్డింగ్ దగ్గరకు వచ్చిన సత్యేంద్రసింగ్, సత్యనారాయణ నగదును మార్చుకుంటుండగా పోలీసులు పట్టుకున్నారు. వెంకటనారాయణనూ అదుపులోకి తీసుకున్నారు.