పెషావర్ : పాకిస్తాన్లోని పెషావర్ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఈ దారుణ ఘటనలో ఏడుగురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు పోల్పోయారు. ఒక శిక్షణా స్కూల్లో మంగళవారం శక్తివంతమైన పేలడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించామని పేషావర్ పోలీసు ఆఫీసర్ మన్సూర్ అమన్ తెలిపారు. గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు.
పెషావర్ శివార్లలోని ఇస్లామిక్ సెమినరీ ద్వారా శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించిందని అధికారుల తెలిపారు. జామియా జుబైరియా మదర్సా ప్రధాన హాలులో ఇస్లాం బోధనా ఉపన్యాసం ఇస్తుండగా ఈ బాంబు దాడి జరిగిందని పోలీసు అధికారి వకార్ అజీమ్ వెల్లడించారు. మదర్సా వద్ద ఎవరో ఒక బ్యాగ్ వదిలిపెట్టిన కొద్ది నిమిషాల తరువాత బాంబు పేలిందన్నారు. ఆత్మాహుతి దాడి కాదనిపోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. కాగా క్వెట్టాలో జరిగిన బాంబు దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించిన రెండు రోజుల తరువాత జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.