దిల్లీ: వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన రుణాలకు చక్రవడ్డీ మాఫీ వర్తించదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పంట, ట్రాక్టర్ రుణాలు వ్యవసాయ రుణాల కిందకే వస్తాయి గనుక వాటికి వడ్డీ మాఫీ ఉండదని తెలిపింది. వడ్డీమాఫీపై ఉన్న సందేహాలను నివృత్తి చేసేలా తరచూ అడిగే ప్రశ్నల జాబితా(ఎఫ్ఏక్యూ)ను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఫిబ్రవరి 29 నాటికి ఉన్న క్రెడిట్ కార్డు బకాయిలకు ఈ ఉపశమనం వర్తిస్తుందని మరోసారి స్పష్టం చేసింది. క్రెడిట్ కార్డ్ బకాయిల విషయంలో, మార్చి 1 నుంచి ఆగస్టు 31 వరకు వినియోగదారుల నుంచి ఈఎంఐ ప్రాతిపదికన ఫైనాన్స్ చేసిన లావాదేవీల కోసం కార్డ్ జారీచేసేవారు వసూలు చేసే సగటు రుణ రేటునే(WALR) వడ్డీ రేటుగా పరిగణిస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఆరు నెలల మారటోరియం కాలానికి రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా సాధారణ వడ్డీకి, చక్రవడ్డీకి ఉన్న తేడాను రుణ గ్రహీతల ఖాతాల్లో రుణ విక్రేతలు జమ చేయనున్నారు. మారటోరియం ఉపయోగించుకోని వారికి కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఈ ప్రక్రియను నవంబరు 5నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం, ఆర్బీఐ ఆర్థిక సంస్థల్ని కోరాయి. కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం.. గృహ రుణాలు, విద్య, వాహన, ఎంఎస్ఎంఈ, వినియోగ వస్తువుల కొనుగోలు రుణాలు, వినియోగ రుణాలు వంటివి ఈ స్కీమ్ పరిధిలోకి వస్తాయి. ఈ స్కీమ్ వర్తించాలంటే ఫిబ్రవరి 29 నాటికి సదరు ఖాతా ఎన్పీఏగా గుర్తించి ఉండకూడదని కేంద్రం తన మార్గదర్శకాల్లో స్పష్టంచేసింది.