దిల్లీ: దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గత 24 గంటల్లో కొత్తగా 45,576 కరోనా కేసులు బయటపడ్డాయి. నిన్నటితో పోలిస్తే 18 శాతం పోజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 89,58,484కు చేరింది. అయితే కొత్త కేసుల కంటే రికవరీలు అధికంగా ఉండడం కొద్దిగా ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల్లో 48,493 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తంగా కోలుకున్నవారి సంఖ్య 83,83,603కు పెరిగి రికవరీ రేటు 93.58శాతంగా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,43,303 క్రియాశీల కేసులు ఉండగా.. ఆ రేటు 4.95 శాతానికి చేరింది. కొత్తగా 585 మంది కొవిడ్‌కు బలవ్వగా.. మొత్తం మరణాల సంఖ్య 1,31,578కి పెరిగింది. భారత్‌లో మరణాల రేటు 1.47శాతంగా ఉంది. దేశ రాజధానిలో గత కొన్ని రోజులుగా కొవిడ్ విజృంభిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దిల్లీలో బుధవారం ఒక్కరోజే 7,486 కొత్త కేసులు బయటపడగా.. మొత్తం కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది. ఇక 24 గంటల్లో అత్యధికంగా 131 మంది వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాజధానిలో మొత్తం మరణాల సంఖ్య 7,943కు పెరిగింది. వైరస్ కేసులు నానాటికీ ఎక్కువవడంతో దిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. కరోనా కట్టడి కోసం ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఇప్పటికే దిల్లీలో వివాహాది శుభకార్యాలకు అతిథుల సంఖ్యను 200 నుంచి 50కి పరిమితం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు దిల్లీలో మళ్లీ లాక్డౌన్ తెస్తారని ప్రచారం సాగుతుండగా.. అలాంటిదేమీ లేదని దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్రజైన్ బుధవారం స్పష్టం చేశారు.