తెలుగు తేజం, మచిలీపట్టణం : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మానసిక రుగ్మతను అధిగమించేందుకు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి పేర్నినాని అన్నారు. ఐదేళ్లపాటు భ్రమల్లో ఉన్న ఆయన ఇప్పటికీ భ్రమల్లో ఉంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం మంత్రి పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ తిరుపతి ఎన్నిక చారిత్రక అవసరమని చంద్రబాబు అంటున్నారు. 5 శాతం ఓట్లు వస్తే చాలు అని భ్రమల్లో ఉండి మాట్లాడుతున్నారు. 5 ఏళ్ల చంద్రబాబు పాలన దౌర్జన్యాల మయంగా ఉండేది. సీఎం జగన్ పాలన సంక్షేమమయంగా ఉంది. 90 శాతం హామీలను నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ప్రజలు ఎందుకు వదులుకుంటారు?. కులాలు,మతాలు,రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో పథకాల లబ్ది పొందని కుటుంబం అంటూ ఎక్కడా ఉండదు. అగ్రిగోల్డ్ బాధితులకు చంద్రబాబు ఏమీ చేయకపోతే సీఎం జగన్ న్యాయం చేశారు.ఎన్ని కుట్రలు చేసినా డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున 30 లక్షల మంది పేదలకు ఇంటిస్థలాలు పంపిణీ చేస్తాం. పోలీసులపై, వైఎస్సార్ సీపీ నేతలపై ప్రైవేటు కేసులు వేయాలని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు. అధికారంలో ఉండగా ప్రజలు పంటలు పోయి ఏడుస్తుంటే.. హెలికాప్టర్లో తిరిగారు తప్పిస్తే చంద్రబాబు ఏమీ చేయలేదు. ముఖ్యమంత్రి గురించి మాట్లాడే నైతిక హక్కు బాబుకు లేదు. రైతులకు ఎరువులు, విత్తనాలు కొరత ఉందని చంద్రబాబు దుష్ర్పచారం చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రంలో విత్తనాలు, ఎరువులు అందిస్తున్నాం. డిసెంబర్ 31న నివార్ తుపాను పంట నష్టాన్ని రైతులకు అందిస్తాం. చంద్రబాబును ఆయన కుమారుడే ఆదర్శంగా తీసుకోవట్లేదు’’అని అన్నారు.