Breaking News

15 నుంచి రైల్వే ఉద్యోగాల భర్తీ పరీక్షలు


దిల్లీ: రైల్వే శాఖలో 1.4 లక్షల పోస్టుల భర్తీకి ఈనెల 15 నుంచి పరీక్షలు మొదలవుతాయని రైల్వే బోర్డు మానవ వనరుల విభాగం డైరెక్టర్‌ జనరల్‌ ఆనంద్‌సింగ్‌ ఖాతీ వెల్లడించారు. గత ఏడాది జారీ చేసిన మూడు నోటిఫికేషన్ల పరీక్షలు ఇందులో ఉన్నాయన్నారు. శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ ఉద్యోగాల కోసం 2.44 కోట్ల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్‌ 15 నుంచి ప్రారంభమయ్యే తొలి దశ పరీక్షల కేంద్రాల వివరాలను అభ్యర్థులకు వ్యక్తిగతంగా ఎస్‌ఎంఎస్‌, ఈమెయిల్‌ ద్వారా పంపుతారు. ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల తేదీ, షిఫ్ట్‌ వివరాలు ఉంటాయి. పరీక్షకు నాలుగు రోజుల ముందు ఈ-కాల్‌ లెటర్‌ను ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. తదుపరి దశల పరీక్షలకు సంబంధించిన వివరాలను సమయానుకూలంగా వెల్లడిస్తూ పోతారు. ”మహిళలు, దివ్యాంగులకు పూర్తిగా, మిగతా వారికి సాధ్యమైనంత మేరకు ఏ రాష్ట్రం వారికి ఆ రాష్ట్రాల్లోనే పరీక్ష కేంద్రాలు కేటాయించాం. అవసరమైన చోట్ల పరీక్షార్థుల కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నాం. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష గురించి ముందే అవగాహన పెంచుకోవడానికి వీలుగా పరీక్ష కంటే ముందే మాక్‌టెస్ట్‌ లింక్‌ను అభ్యర్థులకు పంపుతున్నాం. ఈ నియామకాలకు ఇంటర్వ్యూలు ఉండవు. కేవలం పరీక్షల్లో కనిపించిన మెరిట్‌ ప్రాతిపదికనే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ప్రతి పరీక్షకు ముందు అభ్యర్థుల వేలిముద్రలు, ఫొటో తీసుకుంటారు. స్క్రీన్లపై అభ్యర్థుల ఫొటోలు ప్రదర్శితమవుతాయి. సీసీ టీవీ నిఘా, రియల్‌ కమాండ్‌సెంటర్‌ మానిటరింగ్‌ ఉంటుంది. ప్రతి అభ్యర్థి గురించి పూర్తిస్థాయిలో ఆడిట్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తాం. కొవిడ్‌ నేపథ్యంలో ప్రతి అభ్యర్థినీ థర్మల్‌ గన్స్‌ ద్వారా పరీక్షించాకే లోపలికి పంపుతాం. నిర్ణీత ప్రమాణాలకు మించి ఉష్ణోగ్రతలు ఉన్నవారిని పరీక్షలకు అనుమతించరు. వారికి మళ్లీ ఎప్పుడు పరీక్ష నిర్వహించేదీ తర్వాత ఈమెయిల్‌, మొబైల్‌ ద్వారా సమాచారం అందిస్తాం. ప్రతి అభ్యర్థీ మాస్క్‌ ధరించాలి. సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వాలి” అని ఆనంద్‌సింగ్‌ ఖాతీ వివరించారు.

మూడు రకాల నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షల వివరాలు ఇలా..
సీఈఎన్‌ నెం. పోస్టు పేరు ఖాళీలు వచ్చిన దరఖాస్తులు పరీక్ష తేదీలు
03/2019 ఐసోలేటెడ్‌, మినిస్టీరియల్‌ కేటగిరీ 1,663 1.03 లక్షలు ఈనెల 15-18
01/2019 నాన్‌టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీస్‌ 35,208 1.26 కోట్లు డిసెంబర్‌ 28 నుంచి వచ్చే మార్చి వరకు
ఆర్‌ఆర్‌సీ 01/2019 లెవెల్‌-1 1,03,769 1.15 కోట్లు వచ్చే ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *