ఫలించని కేంద్ర మంత్రుల చర్చలు.. ఆందోళనలు ఉధృతం చేస్తామంటున్న రైతు సంఘాలు..!
ఢిల్లీ : కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులు మెట్టు దిగడంలేదు. కేంద్ర ప్రభుత్వం వైఖరి మారకపోవడంతో ఆందోళనలు ముమ్మరం చేయాలని రైతు సంఘాల నేతలు నిర్ణయించారు. మరో జాతీయ రహదారిని దిగ్బంధం, రిలే దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలతో.. ఉద్యమాన్ని విస్తృతం చేయడానికి సన్నద్ధమవుతున్నారు. అయితే, నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రంతో చర్చలకు సిద్ధమేనని వారు ప్రకటించారు. ముందుగా ఆ చట్టాల రద్దుపైనే మాట్లాడాలని, ఆ తర్వాతే మిగిలిన అంశాలను చర్చిస్తామని స్పష్టం చేశారు. అదే తమ ప్రధాన డిమాండ్ అని తేల్చి చెబుతున్నారు.
మరోవైపు, రాజస్థాన్‌లోని షాజహాన్‌పుర్ నుంచి జయపుర-దిల్లీ జాతీయ రహదారి మీదుగా వేల సంఖ్యలో రైతులు ట్రాక్టర్లతో ఆదివారం ‘చలో దిల్లీ’ యాత్రను నిర్వహిస్తారని రైతు ఉద్యమ నేత కన్వల్‌ప్రీత్ సింగ్ పన్నూ చెప్పారు. సోమవారం సింఘు సరిహద్దులో రైతు నేతలంతా నిరాహార దీక్ష చేస్తారని, ఆ రోజు దేశవ్యాప్త నిరసనల్లో రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఈ నెల 19లోగా ప్రభుత్వం దిగి రాకపోతే ఆమరణ దీక్ష చేపడతామని ప్రకటించారు. ఉద్యమాన్ని నీరుగార్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా.. అది అసాధ్యమని తేల్చిచెప్పారు. రైతుల తల్లులు, భార్యలు, కుమార్తెలు కూడా త్వరలో ఉద్యమానికి సంఘీభావంగా రాబోతున్నారని, దీక్షా శిబిరాల్లో దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులూ తమకు మద్దతుగా వస్తున్నట్లు తెలిపారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాబోయే రోజుల్లో ఉద్యమ వ్యాప్తి ఖాయమని పన్నూ స్పష్టంచేశారు.
ఆందోళనను ముమ్మరం చేయాలని రైతులు నిర్ణయించుకున్న నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ పోలీసు బలగాలను మోహరించాయి. ప్రధానంగా ఢిల్లీ-జయపుర జాతీయ రహదారిని, యమునా ఎక్స్‌ప్రెస్‌వేని స్తంభింపజేయాలని రైతులు యోచిస్తుండడంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
రైతులతో ప్రభుత్వం తదుపరి విడత చర్చల్ని 40 గంటల్లోగా ప్రారంభిస్తుందని, పరస్పర ఆమోదయోగ్య పరిష్కారం లభిస్తుందని హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు తోమర్, రాజ్‌నాథ్‌సింగ్, పీయూష్ గోయల్‌లతో చౌతాలా శనివారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ప్రతిష్టంభన తొలగించేలా ప్రభుత్వంతో రైతు సంఘాల సత్వర సమావేశానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్రమంత్రి సోమ్‌ప్రకాశ్ తెలిపారు. చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించాలని, ఇది ఇరుపక్షాలకూ తెలుసునని అన్నారు. రైతుల ఉద్యమానికి ‘జమాతే ఇస్లామీ హింద్’ (జేఐహెచ్) మద్దతు ప్రకటించింది.
రైతుల ఆందోళనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. రైతుల ఉద్యమంలో గత 17 రోజుల్లో 11 మంది వివిధ కారణాలతో చనిపోయారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలిపారు. చట్టాల రద్దుకు ఇంకెంతమంది ఇలా ప్రాణాలు కోల్పోవాలంటూ ట్విటర్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు