ఢిల్లీ : కేంద్రంతో తాజా చర్చలపై రైతు సంఘాలు మంగళవారం నిర్ణయం తీసుకోనున్నాయి. చర్చలకోసం తేదీని ప్రకటించాల్సిందిగా వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ తమ లేఖలో కోరిన నేపథ్యంలో ఈ సంఘాలు నేడు సమావేశమై తమ భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోనున్నాయి. బీహార్ వంటి ఇతర రాష్ట్రాల అన్నదాతలు కూడా మా ఆందోళనలో పాలుపంచుకోవాలని కోరుతున్నాం అని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన రైతులంతా నిన్న నాసిక్ లో సమావేశమై అక్కడి నుంచి ఢిల్లీ బోర్డర్ చేరుకున్నారు. అంతకు ముందు కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మలను వారు తగులబెట్టారు. చర్చల కోసమంటూ కేంద్రం తాజాగా పంపిన ఆహ్వానంలో కొత్త అంశాలేవీ లేవని రైతు సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. కాగా రైతు చట్టాలపై చర్చించేందుకు ప్రత్యేకంగా పార్లమెంటును సమావేశపరచాలని అకాలీదళ్ మళ్ళీ డిమాండ్ చేసింది. తాము ఇదివరకే ఈ కోర్కె కోరామని, కానీ ఇందుకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఏదీ లభించలేదని ఈ పార్టీ పేర్కొంది.
ఇప్పటివరకు 30 మందికి పైగా రైతులు మృతి చెందినప్పటికీ కేంద్రం నంచి స్పందనే లేదని అకాలీదళ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పలువురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.