తెలుగు తేజం, విజయవాడ: నివర్ తుపాను కారణంగా కృష్ణా జిల్లాలోనే ఎక్కువ మంది రైతులు నష్టపోయిన కారణంగా వారికి భరోసా కల్పించే ఉద్దేశంతో ఈ నెల 28వ తేదీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లా కలెక్టర్ కి స్వయంగా వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించినట్టు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కౌలు రైతులు కూడా పెద్ద సంఖ్యలో నష్టపోయారని, నెల రోజుల వ్యవధిలోనే కృష్ణా జిల్లా వ్యాప్తంగా నలుగురు కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు తెలిపారు. వీరిని ఆదుకుని, భరోసా కల్పించే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. బుధవారం సాయంత్రం 28వ తేదీ కార్యక్రమంపై చర్చించేందుకు కృష్ణా జిల్లాకు చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నాయకులు, కార్యకర్తల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “నివర్ తుపాను రైతాంగానికి అపార నష్టం కలిగించిన అనంతరం అధ్యక్షుల వారు ఆయా జిల్లాల్లో రైతుల్ని పరామర్శించి నష్టపోయిన ప్రతి ఎకరాకి ప్రభుత్వం నుంచి రూ. 35 వేల ఆర్థిక సాయం అందించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. అదే డిమాండ్ తో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున దీక్షలు చేపట్టి పోరాటం చేశాం. తక్షణ సాయంగా రూ. 10 వేలు ఇవ్వాలని కోరాం. ప్రస్తుతం ఉన్న ఆర్ధిక పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఇబ్బంది కానే కాదు. అయినప్పటికీ ప్రభుత్వం ఏ మాత్రం స్పందించలేదు. చివరికి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. వీరికి అండగా నిలిచేందుకు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 28వ తేదీ అన్ని జిల్లాల కలెక్టర్లకు రైతుల తరఫున వినతిపత్రాలు సమర్పించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఉదయం 9 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి గుడివాడ, పెడన మీదుగా మచిలీపట్నం చేరుకుంటారు. మార్గమధ్యంలో రైతులతో మాట్లాడుతారు. సుమారు 11 గంటల ప్రాంతంలో కలెక్టర్ కి వినతిపత్రం సమర్పిస్తారు. కౌలు రైతుల కోసం బలంగా నిలబడాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. కౌలు రైతుకు పరిహారం అందించే విధంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. రైతుకి అండగా నిలబడే విధంగా యువత సిద్ధం కావాలి. రైతు పడుతున్న కష్టాన్ని గుర్తించి యువతని భాగస్వామ్యం చేసేందుకే జైకిసాన్ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. రైతు బాగుంటేనే మనం బాగుంటాం- శ్రీ పి. హరిప్రసాద్అ ధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి శ్రీ పి. హరిప్రసాద్ మాట్లాడుతూ.. “జనసేన పార్టీ పోరాట ఫలంగా నివర్ తుపాను బాధిత రైతాంగానికి సాయం అందాలన్న లక్ష్యంతో పవన్ కల్యాణ్ , మనోహర్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. పార్టీ పక్షాన రైతులకు సహాయం అందాలి. రైతు బాగుంటేనే మనమంతా బాగుంటాం అని విశ్వసిస్తూ ఒక పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. కోవిడ్ నిబంధలు పాటిస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా క్రమశిక్షణతో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. అప్పుడే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగి రైతులకు సహాయం అందించడానికి ముందుకు వస్తుంది” అన్నారు. టెలీ కాన్ఫరెన్స్ లో పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్, సెంట్రల్ ఆంధ్రా సంయుక్త కమిటీ కన్వీనర్ కళ్యాణం శివశ్రీనివాస్(కె.కె.), సెంట్రల్ ఆంధ్రా సంయుక్త కమిటీ సభ్యులు అమ్మిశెట్టి వాసు, పార్టీ నాయకులు బండ్రెడ్డి రామకృష్ణ, కృష్ణా జిల్లాలోని నియోజకవర్గాల ఇంఛార్జులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.