నందిగామ మున్సిపాలిటీ మరియు వార్డు సచివాలయాల పనితీరుపై శాసనసభ్యులు డా. మొండితోక జగన్ మోహన్ రావు స్థానిక అధికారులతో సమీక్ష
తెలుగు తేజం, నందిగామ : నందిగామ మున్సిపాలిటీ మరియు వార్డు సచివాలయాల పనితీరుపై శాసనసభ్యులు డా. మొండితోక జగన్ మోహన్ రావు స్థానిక కె.వి.ఆర్ కళాశాల లో అధికారులతో గురువారం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. వార్డు సచివాలయాలు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేయాలన్నారు. నందిగామ పట్టణ పరిధిలోని 20 వార్డులలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్ పనులు, వార్డుల్లో ప్రాధాన్యత క్రమంలో నిర్మించాల్సిన సిసి రోడ్లు, డ్రైనేజీలపై అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై పట్టణంలోని వార్డుల్లో పారిశుద్ధ్యం నిర్వహణపై అధికారులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. నందిగామ పట్టణంలోని అన్ని వార్డులను ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేస్తామని నవ నందిగామ నిర్మాణానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని, అదేవిధంగా పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు కోసం ప్రభుత్వానికి పలు నివేదికలు పంపామని తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని వార్డు సచివాలయాల్లో ప్రజలు ఇచ్చిన అర్జీలను ప్రత్యేకంగా పరిశీలించి , అన్నింటినీ పరిష్కరించాలని, ఏ ఒక్క అర్జీని కూడా పెండింగ్లో పెట్టవద్దని, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏ లక్ష్యంతో అయితే వార్డు సచివాలయాల వ్యవస్థను రూపొందించారో దానికనుగుణంగానే సచివాలయ సిబ్బంది పని చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్, మున్సిపల్ కమిషనర్, మున్సిపాలిటీ అధికారులు , సిబ్బంది, వార్డు సచివాలయ అధికారులు, వీఆర్వోలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.