అనుమతి పత్రాన్ని బహిరంగంగా ప్రదర్శించాలి
వాహనదారులు సైతం ప్రశ్నించవచ్చు
అనుమతులు లేనివారి సమాచారం ఇవ్వండి
వాహనచోదకులకు డిటీసీ యం.పురేంద్ర పిలుపు
తెలుగు తేజం, విజయవాడ: నాణ్యత ప్రమాణాలు చూడకుండా ఉత్తుత్తి వాహన తనిఖీలు చేపట్టి వాహనాలకు కాలుష్య తనిఖీ పత్రాలను జారీ చేస్తున్న మొబైల్ వాహనాల నిర్వహకులపై కేసులు నమోదు చేయడం జరిగిందని డిటీసీ యం.పురేంద్ర తెలిపారు. విజయవాడలోని డిటీసీ కార్యాలయం నుండి మంగళవారం నాడు ఒక ప్రకటనను విడుదల చేసారు. డిటీసీ మాట్లాడుతూ వాహన కాలుష్య తనిఖీ పత్రాలను జారీ చేస్తున్న కొందరు మొబైల్ వాహన నిర్వాహకులు వాహనాలకు ఎటువంటి కాలుష్య తనిఖీలు చేపట్టకుండానే డబ్బులను వసూలు చేసుకొంటూ తప్పుడు పత్రాలను జారిచేస్తున్నారని ఆయన అన్నారు. వాహన చోదకుల నుండి వస్తున్న ఫిర్యాదుల మేరకు మంగళవారం నాడు నగరంలోని పలుచోట్ల వాహన కాలుష్య తనిఖీలు చేయు మొబైల్ వాహనాలపై ప్రత్యేక తనిఖీలను చేపట్టడం జరిగిందన్నారు. ఈ తనిఖీలలో AP09TA 6067 మొబైల్ వాహనంనకు ఎటువంటి అనుమతులు లేకుండా, ఒక కంప్యూటర్ సిస్టమ్ ను కెమెరాను మొబైల్ వాహనంనకు అమార్చుకొని, కాలుష్య తనిఖీలను వచ్చే వాహనాలకు ఫోటోలు తీసి వాహన కాలుష్య తనిఖీలు చేపట్టుతున్నట్లు వాహన చోదకులను నమ్మించి తప్పుడు పత్రాలను ఇస్తూ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నట్లు గుర్తించమని, దీనిపై కేసు నమోదు చెయ్యడమే కాకుండా ఆ వాహనాన్ని సీజ్ చెయ్యడం కూడా జరిగిందన్నారు. వాహన చట్టంలో నిర్ధేశించిన ప్రమాణాలకు అనుగుణంగా వాహన కాలుష్య తనిఖీలు చేసి పత్రాలను జారీ చెయ్యవలసి ఉంటుందన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇష్టానుసారంగా వాహనాల తనిఖీ పత్రాలను జారీ చేస్తే, వాహన యజమానులపై డ్రైవర్ల పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.