తెలుగు తేజం, విజయవాడ: 75 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారని…స్వాతంత్ర్యం రావడానికి కీలకపాత్ర వహించిన జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యను అదేరీతిలో గుర్తించాలని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్ అన్నారు. జాతీయ జెండా ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా విక్టోరియా మూజియంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా విశిష్టతపై ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆయన సందర్శించారు. అనంతరం బుద్ద ప్రసాద్ మాట్లాడుతూ 75 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పింగళి వెంకయ్య కృషిని వెలుగెత్తి చాటాల్సిన అవసరం అందరిపై ఉందని తెలిపారు. పింగళి వెంకయ్యకు గతంలో జరిగిన అన్యాయాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పారు. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభ సమయంలో జాతీయ పతాకాన్ని రూపొందించాలని సాక్షాత్తు మహాత్మాగాంధీయే పింగళి వెంకయ్యకు సూచించారని అన్నారు. గాంధీ స్ఫూర్తితోనే పింగళి వెంకయ్య జాతీయ పతాకానికి రూపకల్పన చేశారన్నారు. రేపు నగరంలో జాతీయ జెండా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు మండలి బుద్ద ప్రసాద్ వెల్లడించారు.