తైవాన్ విషయంలో అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. కొద్దిరోజుల క్రితం చైనాను హెచ్చరించిన విషయం తెలిసిందే. తైవాన్లో చైనా ఆక్రమణకు పాల్పడితే డ్రాగన్ కంట్రీ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. ఇలా హెచ్చరించిన కొద్ది రోజులకే.. చైనా తన అసలు స్వరూపాన్ని చూపించింది. తైవాన్ పరిసర ప్రాంతాల్లో చైనా తన వైమానిక కార్యకలాపాలను పెంచింది. తైవాన్ వైమానిక దళంలోకి చైనా 30 యుద్ధ విమానాలను పంపింది. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకున్నది. అయితే, చైనా కవ్వింపు చర్యకు తైవాన్ ధీటుగానే స్పందించింది. తైవాన్ కూడా యుద్ధ విమానాలను మోహరించినట్లు తాజాగా వెల్లడించింది. అయితే, తన చర్యలను చైనా సమర్ధించుకుంది. సైనిక శిక్షణలో భాగంగానే వైమానిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చైనా పేర్కొంది. కాగా, చైనా వ్యాఖ్యలపై తైవాన్ మాత్రం సందేహాలు వ్యక్తం చేస్తోంది. తైవాన్ వైమానిక రక్షణ క్షేత్రంలో ఉన్న ప్రటాస్ దీవుల వద్దకు చైనా యుద్ధ విమానాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో 20 ఫైటర్ జెట్స్ ఉన్నట్టు సమాచారం. చైనా చర్యలో తర్వలో మరో యుద్ధాన్ని చూడాల్సి వస్తుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి