శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో మైనార్టీలను లక్ష్యంగా ఉగ్ర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా కుల్గాం జిల్లాలో ఓ స్కూల్ టీచర్‌ను కాల్చి చంపారు ఉగ్రవాదులు. గోపాల్‌పోరా ప్రాంతంలో ప్రభుత్వ హైస్కూల్ ఉపాధ్యాయురాలిపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ఆలోపే ఆమె కన్నుమూశారు. మృతురాలిని సాంబా ప్రాంతానికి చెందిన రజ్ని బాలా(36)గా పోలీసులు ప్రకటించారు. ఆమె కశ్మీరీ పండిట్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనపై స్పందించిన పోలీసులు.. ఉగ్రవాదుల్ని వీలైనంత త్వరగా ఏరివేస్తామని తెలిపారు. నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా ఈ దాడిని ఖండించారు. మూడు వారాల కిందట.. కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ అనే ప్రభుత్వ ఉద్యోగిని కార్యాలయంలోనే ఉగ్రవాదులు బుద్గంలో కాల్చి చంపిన విషయం తెలిసిందే. అదే విధంగా వారం కిందట.. టీవీ నటి అమ్రీన్ భట్‌ను సైతం ఉగ్రవాదులు కిరాతకంగా కాల్చి చంపారు. ఇదిలా ఉంటే.. ఈ నెలలో ఉగ్రదాడుల్లో ఇది ఏడో మరణం. ముగ్గురు పోలీస్ సిబ్బందికాగా, నలుగురు పౌరులు మరణించారు.