శ్రీ సత్య సాయి జిల్లా: రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించడంలో రాష్ట్రంలోని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించకపోవడంతోనే తాను వైకాపా విధానాలపైన మాట్లాడడం జరుగుతోందని పురందేశ్వరి తెలిపారు. అంత మాత్రాన తాను టిడిపికి కోవర్టుగా ఎలా అవుతానని ఆమె ప్రశ్నించారు. సోమవారం శ్రీ సత్య సాయి జిల్లా పర్యటనలో భాగంగా పురందేశ్వరి పుట్టపర్తి జిల్లా కేంద్రంలో పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె పై విధంగా స్పందించారు. తాను రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవిని చేపట్టిన అనంతరం రాష్ట్రంలోని జిల్లాల పర్యటన చేయాలనే ఆలోచనలో భాగంగా శ్రీ సత్య సాయి జిల్లాకు విచ్చేయడం జరిగిందన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా అంటేనే నందమూరి వంశానికి ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు. ముఖ్యంగా తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావును ఈ జిల్లా ప్రజలు చాలా ప్రేమించారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఒకరకంగా తాను శ్రీ సత్యసాయి జిల్లాలోకి రాగానే తన తండ్రి ఎన్టీ రామారావు ఆశీర్వాదం తనకు లభించినట్లుగా భావిస్తున్నానన్నారు. నందమూరి వంశం జిల్లా ప్రజలకు రుణపడి ఉన్నాదని ఆమె అన్నారు. కాగా రాష్ట్రం విడిపోయిన అనంతరం కొత్త రాష్ట్రంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తూ అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధి పరంగా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందంజలో ఉంచాలనే లక్ష్యంతో కేంద్రంలోని మోడీ నాయకత్వ ప్రభుత్వం హితోదికంగా రాష్ట్రానికి నిధులు ఇవ్వడం జరుగుతోందన్నారు.