నూజివీడు: నూజివీడు నియోజకవర్గం పరిధిలోని చాట్రాయి మండలం కృష్ణారావు పాలెం గ్రామంలో ఉన్న అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద శనివారం నిర్వహించిన తనిఖీలలో భారీగా అక్రమ మద్యం సీజ్ చేసినట్లు స్పెషల్ ఎంఫోర్స్మెంట్ బ్యూరో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కృష్ణ ధనరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా భారీ స్థాయిలో మద్యం తరలిస్తున్నారని సమాచారంతో దాడులు నిర్వహించినట్లు చెప్పారు. ఈ దాడులలో పామర్తి గోపాలకృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని, అతని వద్దనుండి 100 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విచారించగా అక్రమంగా నిలువ ఉంచిన తెలంగాణ రాష్ట్రం మరియు యానం లకు చెందిన 97 ఫుల్ బాటిల్స్, 706 క్వార్టర్ బాటిల్స్ మొత్తంగా 803 మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పామర్తి గోపాలకృష్ణ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఎన్నికలవేళ రాష్ట్రాల సరిహద్దులలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎంతటి వారైనా అక్రమ మద్యం కలిగి ఉన్నా, విక్రయించినా, సరఫరా చేసినా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. సత్ప్రవర్తనతో సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని సూచించారు. ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశం మేరకు జిల్లా స్పెషల్ ఎంఫర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పి ఎన్ సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో ఈ దాడులను నిర్వహించినట్లు చెప్పారు. దాడులలో ఎస్ ఈ బి ఇనస్పెక్టర్ గోపాలకృష్ణ, ఎస్సై అల్లూరయ్య, హెడ్ కానిస్టేబుల్ కే వివి సత్యనారాయణ, కానిస్టేబుల్ శ్రీనివాస్, సింగ్ లతో కలసి దాడులు నిర్వహించినట్లు వివరించారు. నిందితుడిని కోర్టుకు హాజరు పరిచినట్లు తెలిపారు.