
- ఉపాధి హామీ పథకం ప్రతి అంశంలోనూ పురోగతి కనిపించాలి
- సిబ్బంది పనితీరులో బాధ్యతా రాహిత్యం కనిపిస్తే చర్యలు తప్పవు
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఎన్టీఆర్ జిల్లా, తెలుగు తేజం ప్రతినిధి: జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం ద్వారా కూలీలు దినసరి సగటు వేతనం రూ. 300 హక్కుగా పొందేలా క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది సరైన ప్రణాళికతో పనులు చేపట్టేలా వ్యవహరించాలని, ప్రతి గ్రామ పంచాయతీలోనూ పురోగతి కనిపించాలని, సిబ్బంది పనితీరులో బాధ్యతా రాహిత్యం కనిపిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ హెచ్చరించారు.
బుధవారం కలెక్టర్ డా. జి.లక్ష్మీశ కలెక్టరేట్ నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలం వారీగా, గ్రామపంచాయతీ వారీగా చేపడుతున్న పనులు, హాజరవుతున్న కూలీలు, సగటు వేతనం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ ఏడాది జనవరితో పోల్చితే ఫిబ్రవరి నాటికి కొన్ని మండలాలు, గ్రామపంచాయతీల్లో సగటు వేతనంలో పెరుగుదల కనిపించిందని, పథకం అమల్లో మిగిలిన మండలాలు, గ్రామపంచాయతీలు కూడా లక్ష్యాలు చేరుకోవాలని ఆదేశించారు. ఫీల్డ్ అసిస్టెంట్లు క్రియాశీలంగా పనిచేయాలని స్పష్టం చేశారు.
ఎంఎస్ఎంఈ సర్వేను వేగవంతం చేయాలి:
రాష్ట్ర పారిశ్రామిక శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) సర్వేలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. పోటీతత్వ, ఆరోగ్యకర పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం, పారిశ్రామిక యూనిట్ల అవసరాలు, ఎంఎస్ఎంఈ యూనిట్లలో సాంకేతిక వినియోగం, నిర్వహణ నైపుణ్యాల్లో లోపాలను గుర్తించి, సరిదిద్దేందుకు కూడా సర్వే ఫలితాలు దోహదం చేస్తాయన్నారు. ఇప్పటివరకు 28,816 యూనిట్ల సర్వే పూర్తయిందని, మిగిలినవాటి సర్వేను కూడా త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. సర్వేను వేగవంతం చేసేందుకు ఎప్పటికప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి మార్గనిర్దేశనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదేవిధంగా పీఎం విశ్వకర్మ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన వారం రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. నరేగా-పల్లెపండగ కింద పశువుల షెడ్లకు సంబంధించి 746 పనులు మంజూరు కాగా 451 పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. సీసీ రోడ్లకు సంబంధించి 612 పనులు మంజూరు కాగా 49.51 శాతం మేర పనులు పూర్తయ్యాయని, మిగిలిన రోడ్లను కూడా నెలాఖరులకు పూర్తిచేసేందుకు చొరవ చూపాలని ఆదేశించారు. రైతులకు సంజీవని వంటి పంట పొలాల్లో నీటి కుంటల (ఫార్మ్ పాండ్స్)పై అవగాహన కల్పించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. సమావేశంలో డ్వామా పీడీ ఎ.రాము, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి తదితరులు పాల్గొన్నారు. వర్చువల్గా మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.