విజయవాడ: అక్టోబర్ 7వ తేదీ నుంచి 15వరకు దసరా ఉత్సవాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఉత్సవాలకు సంబంధించి గురువారం అధికారులతో ఆయన కో-ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలనూ సమన్వయం చేసినట్లు చెప్పారు. అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు కొవిడ్ నిబంధనలతో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. టైం స్లాట్ ద్వారా రోజూ పదివేల మంది భక్తులను అనుమతించనున్నట్లు చెప్పారు. మరోవైపు వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
భక్తులు సర్టిఫికెట్లు తెచ్చుకోవాలి:అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు తెచ్చుకోవాలని కలెక్టర్ నివాస్ సూచించారు. ఆయన మాట్లాడుతూ ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. గతేడాది మాదిరే ఆన్లైన్ బుకింగ్ ద్వారా భక్తులను అనుమతిస్తున్నట్లు తెలిపారు. 90 శాతానికి పైగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తైందన్నారు. ఇంకా ఎవరైనా ఉంటే చేయించుకోవాలని సూచించారు. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.