విజయవాడ: అగ్రిగోల్డ్ సంస్థ వల్ల తీవ్రంగా నష్టపోయామని తమకు న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ బాధితులు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆందోళనలను తీవ్రం చేస్తామని అగ్రిగోల్డ్ బాధితులు హెచ్చరించారు. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవాలని కోరారు. ఈనెల 15వ తేదీన ఛలో అగ్రిగోల్డ్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈ విషయంపై డీసీపీ విశాల్ గున్ని బాధితులను హెచ్చరించారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘విజయవాడలో ఛలో అగ్రిగోల్డ్‌కు బాధితులు పిలుపునిచ్చారని.. ఈ నిరసనలకు ఎలాంటి అనుమతి లేదు. ఒకవేళ అతిక్రమిస్తే తీవ్ర చర్యలు తీసుకుంటాం. నగరంలో సెక్షన్ 144, సెక్షన్ 30 అమలులో ఉన్నాయి.శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించొద్దు. ప్రజలు ఇబ్బందులు పడతారనే అగ్రిగోల్డ్ బాధితులకు అనుమతి ఇవ్వలేదు. 4000 మంది పోలీస్ సిబ్బందిని తనిఖీలు, బందోబస్తుకు ఏర్పాటు చేశాం. విజయవాడలోకి వచ్చే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తాం. అతిక్రమిస్తే 143, 290, 198 సెక్షన్ల కింద పలు కేసులు పెడతాం. గణేశ్ మండపాలను ఏర్పాటు చేసుకునే భక్తులు కమాండ్ కంట్రోల్లోని సింగిల్ విండోలో అనుమతి తీసుకోవాలి. గణేషష్ నిమజ్జనానికి ఒకే చోట అనుమతులు ఇస్తాం. అన్ని డిపార్ట్మెంట్లలోని అధికారులు నిమజ్జనం దగ్గర అందుబాటులో ఉంటారు. నిమజ్జనానికి వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. లా అండ్ ఆర్డర్ కాపాడడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం.