తెలుగు తేజం విజయవాడ: విజయవాడ లో నిల్వ ఉన్న మటన్ విక్రయాలు కొనసాగిస్తున్న విషయాన్ని కార్పోరేషన్ అధికారులు గుర్తించారు. పాతబస్తీలోని గొల్లపాలెం సెంటర్‌లో ఉన్న మాంసం దుకాణాలపై ఆదివారం ఫుడ్‌సేఫ్టీ అధికారులు కొరడా ఝుళిపించారు. ఇష్టానుసారంగా ఎలాంటి అనుమతులు లేకుండా మేకలను చంపి కుళ్లిపోయిన మాంసం అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో కొత్తపేట, గొల్లపాలెం, సింగనగర్, భవానీపురం, చిట్టినగర్, పటమట, పటమట లంక, రామకృష్ణాపురం ప్రాంతాల్లో పలు షాపుల్లో దాడులు నిర్వహించారు. నిల్వ ఉంచిన మాంసంను పరిశీలించగా అది కుళ్లిపోయి దాని నుంచి పురుగులు బయటికి వచ్చాయి. దీంతో వివిధ షాపుల్లో 10 రోజులకు పైబడిన 500 కిలోల మటన్‌తో పాటు నిల్వ ఉంచిన 70 మేక తలకాయలు స్వాధీనం చేసుకున్నారు. నిల్వ ఉంచిన కుళ్ళిన, దుర్వాసన వస్తున్నా, పురుగులు పట్టిన మాంసాన్ని స్వాధీనం చేసుకుని బ్లీచింగ్, సున్నం చల్లి కబేళా ప్రాగణంలో పూడ్చి పెట్టారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, సహాయక వైద్య అధికారులు, సానిటరీ ఇన్స్పెక్టర్లు బృందాలుగా ఎరపడి ఈ దాడులు నిర్వచించారు. దీంతో పలు రెస్టారెంట్ లకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంచిన అనేక మాంస పదార్దాలు పట్టుబడ్డాయి.
ఈ సందర్భంగా సాయి, సాంబశివరావు అనే వ్యక్తులకు చెందిన మటన్ షాపులను సీజ్ చేశారు. ఆ షాపు యజమానులనుండి ౩౦ వేళా చొప్పున ౬౦ వేలు అపరాధ రుసుము విధించారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు మీడియాతో మాట్లాడుతూ నిల్వ చేసి ఉన్న మటన్‌లో పురుగులు ఉన్నాయని. ఇలాంటి మాంసం తింటే ప్రజలు అనారోగ్యానికి గురవుతారని సూచించారు. మటన్, చికెన్ ప్రియులు తాజా మాంసాన్నే కొనలాని తెలిపారు. కాగా షాపుల నుంచి స్వాధీనం చేసుకున్న మాంసం శాంపిల్స్‌ను అధికారులు ల్యాబ్‌కు పంపించారు. ఇకపై నిల్వ ఉంచిన మాంసం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.