హైదరాబాద్/అఫ్జల్‌గంజ్ : గ్రేటర్ హైదరాబాద్‌లో బల్దియా ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాగానే కమలనాథుల్లో టికెట్ల లొల్లి మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడికి బీజేపీ టికెట్ ఇస్తున్నారని ఊహాగానాలు వెలువడడంతో బీజేపీకి చెందిన సీనియర్ నాయకులు డి. గోపాల్జీ, లాల్‌సింగ్, సోమేష్ అభిజిత్, రఘు, శీలంపల్లి సురేష్, కార్యకర్తలు ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్ డాక్టర్ కె. లక్ష్మణ్‌ను రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ప్రశ్నించారు. దీంతో కొద్దిసేపు కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డాక్టర్ లక్ష్మణ్‌కు స్వయానా బావమరిది అయిన కాంగ్రెస్ నాయకుడు ఆల పురుషోత్తంరావుకు గోషామహల్ డివిజన్ కార్పొరేటర్ టికెట్ ఖరారైనట్లు గోషామహల్లో ఊహాగానాలు వెల్లువెత్తడంతో కొంతమంది కార్యకర్తలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
దీంతో బీజేపీ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశం అవుతున్న విషయం తెలుసుకున్న డి. గోపాల్జీ తన అనుచరులతో కార్యాలయానికి చేరుకొని బయటకు వస్తున్న డాక్టర్ లక్ష్మణ్‌ను అడిగారు. డాక్టర్ కె. లక్ష్మణ్ తన చేతిలో ఏమీ లేదని, మీ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో సంప్రదించాలని చెప్పాడు. దీంతో ఆయన కూడా అదిష్టానం టికెట్ ఎవరికిస్తే వారి గెలుపునకు కృషి చేస్తానని తమతో చెప్పాడని, కాబట్టి పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకే టికెట్ ఇవ్వాలని, పురుషోత్తంకు టికెట్ ఇస్తే ఊరుకునే ప్రసక్తేలేదని గోపాల్జీ తదితరులు ఆగ్రహించారు. అనంతరం ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వివరించి వినతిపత్రం అందించారు.