చంద్రబాబు నియమించాడని ఆయన చెప్పినట్లు చేస్తున్నాడు
నిమ్మగడ్డ రాజీనామా చేసిన ఎన్నికల కమిషన్ గౌరవాన్ని కాపాడాలి : మంత్రి శ్రీ కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) తెలుగు తేజం, గుడివాడ : ఎన్నికల కమిషన్ పై తమకు గౌరవం వుందని, కానీ రాజ్యాంగబద్దమైన పదవిలో వుంటూ ప్రతిపక్షనేత చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్న ఎస్ఇసి నిమ్మగడ్డ రమేష్ వ్యవహరిస్తున్న తీరును సమర్థించలేమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ తాను రాజ్యాంగ వ్యవస్థలో వున్నానని, తాను ఏం చేసినా ఎవరూ మాట్లాడకూడదనే ఉద్దేశంతో నిమ్మగడ్డ రమేష్ వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు తన హయాంలో మరో రెండుమూడు నెలల్లో రిటైర్డ్ అయ్యే సమయంలో తన ముసుగుగా నిమ్మగడ్డ రమేష్ ను ఎన్నికల కమిషన్ చీఫ్ గా నియమించారని అన్నారు. ఆ కృతజ్ఞతతో ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ సదరు ముసుగును కూడా తీసేసి చంద్రబాబు కోసం పనిచేస్తూ, ఆయన చెప్పినట్లు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్దమైన పదవిలో వున్న ఆయన ఎవరిని అడిగి ఎన్నికలను వాయిదా వేశారని ప్రశ్నించారు. రాజ్యాంగబద్దంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని సంప్రదించకుండా, చంద్రబాబు చెప్పాడని ఎన్నికలను వాయిదా వేశాడని విమర్శించారు. ముఖ్యమంత్రిని ఫ్యాక్షనిస్ట్ అంటూ ఎలా మాట్లాడతారని నిలదీశారు. తనకు ప్రాణహాని వుందని, కేంద్ర భద్రత కావాలని కోరడం ద్వారా రాజ్యాంగబద్దంగా ఎన్నికైన ఈ ప్రభుత్వాన్ని నిమ్మగడ్డ కించపరిచారని అన్నారు. తన వ్యవహారశైలితో రాజ్యాంగబద్దమైన పదవికే నిమ్మగడ్డ మచ్చ తెస్తున్నారని, ఇప్పటికైనా తాను రాజీనామా చేసి ఆ పదవికి వున్న గౌరవాన్ని కాపాడాలని కోరారు.