రేపు సచివాలయాల్లో అర్హుల జాబితాల ప్రదర్శన
షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు
తెలుగు తేజం, అమరావతి : ప్రస్తుత విద్యా సంవత్సరానికి జగనన్న అమ్మ ఒడి పథకం కింద ఆర్థిక సాయం జనవరి 9వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందజేయనున్నట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే పాఠశాలల్లో అర్హులైన విద్యార్థుల తల్లులు, సంరక్షకుల పేర్లు నమోదు ప్రక్రియ చేపట్టామని తెలిపారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ పథకం కింద రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు వర్తింపజేస్తామని తెలిపారు. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ షెడ్యూల్‌ను మంత్రి వివరించారు.
పాఠశాలల్లో అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకుల పేర్లు నమోదు ఈ నెల 10వ తేదీనే ప్రారంభమైందని, ఈ నెల 16న అర్హుల జాబితాను వార్డు, గ్రామ సచివాలయాల్లో ప్రదర్శనకు పెడతామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఎయిడెడ్ అన్ఎయిడెడ్, ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ పథకం వర్తింపజేస్తామన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు ఈ నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్, రేషన్‌కార్డు జిరాక్స్ కాపీలు అందజేయాలన్నారు. మొదటి విడతగా 43,54,600పైగా లబ్ధిదారులకు రూ.6,336 కోట్లు అందజేశామన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా, కుల, మత ప్రాంతాలకు అతీతంగా, పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందన్నారు. 27, 28 తేదీల్లో గ్రామ వార్డు సభల్లో తుది జాబితాలకు ఆమోదం తెలుపుతారని, 30న తుది జాబితాలకు జిల్లా కలెక్టర్లు ఆమోదం తెలుపుతారని చెప్పారు.