కేంద్రానికి నెలరోజుల గడువు విధింపు
దిల్లీ: డిస్ ఇన్ఫెక్షన్ టన్నెళ్ల వినియోగాన్ని నిషేధిస్తూ గురువారం కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయాలని, నెల రోజుల్లో ఆ ప్రక్రియను పూర్తి చేయాలని గడువు విధించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కార్యాలయాలు, మాల్స్, మార్కెట్ల వంటి తదితర రద్దీ ప్రదేశాల్లో డిస్ఇన్ఫెక్షన్ టన్నెళ్లు, అతినీలలోహిత కిరణాల వంటి వాడకం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న పిటిషనర్ విన్నపాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈ తీర్పును వెలువరించింది. న్యాయశాస్త్ర విద్యార్థి గుర్సిమ్రన్ సింగ్ నరులా ఈ పిటిషన్‌ను దాఖలు చేయగా..జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
‘వైరస్‌ను తుడిచిపెట్టేస్తుందన్న నమ్మకంతో డిస్ ఇన్ఫెక్షన్ టన్నెళ్ల ద్వారా క్రిమిసంహారకాలను వెదజల్లేలా, అతినీల లోహిత కిరణాలను మనుషులపై ప్రసరించేలా చేస్తున్నాం. కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర సంస్థలు ఈ క్రిమిసంహారకాలు చూపించే హానికార ప్రభావంపై ఇప్పటికే హెచ్చరికలు చేశాయి’ అని నరులా తన పిటిషన్లో కోర్టుకు వెల్లడించారు. అందుకే ఆ టన్నెళ్ల వాడకం, ఉత్పత్తి, అమ్మకాలు, వాటికి సంబంధించిన ప్రకటనలపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థన చేశారు. ఈ క్రమంలోనే కోర్టు తీర్పు వెలువడింది. ఇదిలా ఉండగా..దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 83,64,086 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, 1,24,315 మంది మహమ్మారికి బలయ్యారు. నిన్న ఒక్కరోజే 704 మరణాలు సంభవించాయి.