గుంటూరు: గుంటూరు జిల్లాలో కొత్తగా ఏర్పడబోతున్న పల్నాడు జిల్లాకు జిల్లా కేంద్రం ఎక్కడ ఏర్పాటవుతుందనే అంశంపై వివాదం ముదురుతోంది. పల్నాడు జిల్లా ఏర్పాటు విషయంలో పోరు ఉధృతమవుతోంది. గురజాలలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు పాల్గొన్నారు. గురజాల కేంద్రంగానే పల్నాడు జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే.. అధికార వైసీసీ ఇప్పటికే పల్నాడు జిల్లాకు నరసరావుపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అదేగానీ జరిగితే.. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమవ్వాలని అఖిలపక్ష పార్టీలు నిర్ణయించాయి. స్థానికంగా చారిత్రక ప్రదేశాలకు తగిన గుర్తింపు ఇవ్వడంలేదని ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై ప్రజలు మండిపడుతున్నారు. పల్నాడు చరిత్రకు ఎలాంటి సంబంధంలేని నరసరావుపేటను జిల్లా కేంద్రంగా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై పల్నాడు జిల్లా సాధన సమితి ఆందోళన బాట పట్టింది.
అధికార వైసీపీ మాత్రం పల్నాడు జిల్లా కేంద్రంగా నరసరావుపేటకే మొగ్గు చూపుతోంది. పల్నాడు జిల్లాకు దాదాపుగా నరసరావుపేట కేంద్రం కానుంది. ఇప్పటికే.. నరసరావుపేటలో భవనాలను, స్థలాలను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జేసీ దినేష్‌కుమార్ నేతృత్వంలో పరిశీలించారు. పల్నాడు పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రివర్గం నాడు ఆమోదం తెలిపింది. కానీ జిల్లా కేంద్రం ఎక్కడ అనేది అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించలేదు. గురజాల, నరసరావుపేట ప్రాంతాల్లో ఏదో ఒకటి జిల్లా కేంద్రంగా ఏర్పాటు అవుతుందని కొంతకాలంగా ప్రచారం జరిగింది. పార్లమెంటు నియోజకవర్గంలో ఒక్క ఎమ్మెల్యే మినహా మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ నరసరావుపేట వైపే మొగ్గు చూపుతున్నారు.
భవనాల పరిశీలన
లింగంగుంట్లలోని జలవనరుల శాఖకు చెందిన 20 ఎకరాల స్థలాన్ని, రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్ భవనాలను జేసీ దినేష్‌కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సబ్ కలెక్టర్ శ్రీవాస్ నువూర్ వివిధ శాఖల అధికారులు ఇప్పటికే పరిశీంచారు. దాదాపు అన్ని ప్రధాన కార్యాలయాలకు ఈ భవనాలు సరిపోతాయని అంచనా వేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కార్యాలయం, డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కార్యాలయం తాత్కా లికంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా కేంద్రానికి అవసరమైన తాగునీటి లభ్యత కూడా సమృద్ధిగా ఉంది. ఈ అంశాలను కమిటీలు నిర్ధారణకు వచ్చాయి. దీంతో నరసరావుపేటను జిల్లాకేంద్రంగా ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నాయి.
జిల్లాలో 28 మండలాలు..
నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు, వినుకొండ, గురజాల, మాచర్ల అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇవన్నీ పల్నాడు జిల్లా పరిధిలోకి వస్తాయి. 28 మండలాలు కొత్త జిల్లా పరిధిలోకి రానున్నాయి. నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ పురపాలక సంఘాలతో పాటు కొత్తగా ఏర్పాటవుతున్న గురజాల, దాచేపల్లి నగర పంచాయతీలు కూడా పల్నాడు జిల్లా పరిధిలో ఉంటాయి.
నరసరావుపేటలో రియల్ బూమ్
నరసరావుపేటలో జిల్లా కేంద్రంగా ఏర్పాటు అవుతుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్థిరాస్తి వ్యాపారం ఊపందుకుంది. హైదరాబాదు, విజయవాడ నగరాల కంటే ఇక్కడ అధికంగా స్థలాల ధరలు పెరిగాయి. అక్రమ లేఅవుట్లు ఏర్పడ్డాయి. వీటిపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. రిజిస్ట్రేషన్లు చేయకూడని వాగులు, కాలువల స్థలాలను కూడా కొందరు విక్రయిస్తున్నారు. పాలపాడు, రావిపాడు, ఇస్సపాలెం రహదారుల్లో స్థలాల ధరలు చుక్కలనంటాయి.