ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా ఇవాళ గుర్తు తెలియని బాలిస్టిక్ క్షిపణి పరీక్షించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా పేర్కొన్నది. ఒకవైపు ఉత్తర కొరియా నేత కిమ్ ప్రస్తుతం రష్యాలో పర్యటిస్తుండగా, మరో వైపు ఆ దేశం బాలిస్టిక్ క్షిపణి పరీక్షించడం ఆందోళన కలిగిస్తున్నట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. జపాన్ సముద్ర జలాల దిశగా ఆ క్షిపణి వెళ్లినట్లు దక్షిణ కొరియా సంయుక్త దళాల చీఫ్ తెలిపారు. అయితే ఆ క్షిపణి వెళ్లిన మార్గంపై ఇంకా ఎటువంటి వివరణను దక్షిణ కొరియా వెల్లడించలేదు. ఆ క్షిపణి ఇప్పటికే ల్యాండ్ అయ్యిందని, ఆ క్షిపణికి చెందిన భాగాలు సముద్రంలో పడే ప్రమాదం ఉందని కోర్టు గార్డు హెచ్చరికలు జారీ చేసింది. సాధారణంగా క్షిపణి పరీక్ష జరిగిన ప్రతిసారి కిమ్ ఆ టెస్ట్ సెంటర్ వద్ద ఉండేవారు. కానీ ఇవాళ బాలిస్టిక్ మిస్సైల్ పరీక్ష సమయంలో ఆయన లేరు. రష్యా టూర్లో ఉన్న కిమ్.. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. రైలులో రష్యాకు వెళ్లిన కిమ్.. నిన్న కొందరు మంత్రుల్ని కలిశారు. దక్షిణ కొరియా, అమెరికా దళాలు సైనిక విన్యాసాలు చేస్తున్న నేపథ్యంలో.. ఉత్తర కొరియా తన క్షిపణి పరీక్షను స్వేచ్ఛగా కొనసాగిస్తోంది. ఇవాళ కిమ్, పుతిన్ భేటీ అయ్యారు. వోస్టోచిని కాస్మోడ్రోమ్‌లో ఆ ఇద్దరూ కలుసుకున్నారు. రష్యాకు చెందిన తూర్పు ప్రాంతమైన ఆముర్ ప్రదేశంలో వోస్టోచిని కాస్మోడ్రోమ్ ఉంది.