1982 ఫుట్‌బాల్ ప్రపంచకప్ విజేత సభ్యుడు, ఇటలీ దిగ్గజం పాలోరాసీ(64) గురువారం తెల్లవారుజామున కన్నుమూశాడు. ఆయన పనిచేస్తున్న ఆర్ఏఐ స్పోర్ట్స్ వార్తా సంస్థ ఈ విషయాన్ని ట్వీట్ చేసి వెల్లడించింది. 1982 స్పెయిన్‌లో జరిగిన సాకర్ ప్రపంచకప్‌లో రాసీ ఆరు గోల్స్ సాధించి ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. లీగ్ దశలో బ్రెజిల్ పై హ్యాట్రిక్ సాధించిన అతడు తర్వాత సెమీఫైనల్స్‌లో పొలాండ్‌పై 2 గోల్స్ కొట్టాడు. ఇక వెస్ట్ జర్మనీతో తలపడిన ఫైనల్లో తొలి గోల్ ఆయనే సాధించాడు. దాంతో ఇటలీ 3-1 తేడాతో వెస్ట్ జర్మనీపై విజయం సాధించింది. ఇదిలా ఉండగా, పాలోరాసీ జువాంటస్ జట్టు తరఫున నాలుగేళ్లు ఆడి రెండుసార్లు ‘ఇటాలియన్ సిరీస్-ఏ’ టైటిళ్లు అందించాడు. ఒక యూరోపియన్ కప్‌ను అందించాడు. అనంతరం స్పాట్ ఫిక్సింగ్ కేసులో చిక్కుకొని రెండేళ్ల పాటు ఆటకు దూరమయ్యాడు. గురువారం ఉదయం రాసీ మరణించిన కొద్దిసేపటికే సతీమణి కాపెల్లీ ఫెడెరికా ఇన్‌స్టా్గ్రామ్‌లో తన భర్తతో దిగిన ఫొటోను పంచుకొని ‘Forever’ అని పేర్కొంది. అయితే, అతడి మృతికి గల కారణాలను వెల్లడించలేదు. ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా మరణించిన కొద్దిరోజులకే రాసీ మృతిచెందడం ఫుట్‌బాల్ అభిమానులను కలచివస్తోంది.