Breaking News

బాణసంచాపై పలు రాష్ట్రాల బ్యాన్‌.. కారణమేంటి?

దీపావళి వేళ బాణసంచాపై నిషేధం విధించే రాష్ట్రాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే దిల్లీ సహా పలు రాష్ట్రాలు నిషేధం ప్రకటించగా.. తాజాగా ఈ జాబితాలో కర్ణాటక చేరింది. కరోనా విజృంభణ వేళ రాష్ట్రంలో బాణసంచాపై నిషేధం విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి యడియూరప్ప శుక్రవారం ప్రకటించారు. బాణసంచా కాల్చడంతో వాయు కాలుష్యం మరింతగా పెరిగి ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుందన్న నిపుణుల సూచనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ దీపావళికి బాణసంచాపై నిషేధం విధించే అంశంపై అధికారులతో చర్చించామని, ఈ నిర్ణయానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేస్తున్నట్టు వెల్లడించారు.

కారణాలివే..

మరోవైపు, దిల్లీలో వాయు కాలుష్యం పెరగడం, కరోనా విలయతాండవం చేస్తున్న వేళ బాణసంచాపై నిషేధం విధిస్తున్నట్టు సీఎం కేజ్రీవాల్‌ గురువారం రాత్రి ప్రకటించారు. నవంబర్‌ 7 నుంచి 30వ తేదీ వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపారు. వాయు కాలుష్యం, కరోనా వైరస్‌, చలికాలంలో గాలి నాణ్యతపై ఆందోళన వ్యక్తంచేస్తూ ఇప్పటికే ఒడిశా, దిల్లీ, రాజస్థాన్‌ రాష్ట్రాలు బాణసంచాపై నిషేధం ప్రకటించాయి. హరియాణా ప్రభుత్వం కూడా పాక్షికంగా నిషేధం విధించింది. దిగుమతి చేసుకున్న బాణసంచా విక్రయాలను చట్టవిరుద్ధంగా పేర్కొంది. టపాసులు కాల్చేందుకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం.. వీటిపై నిషేధం మాత్రం విధించలేదు. వాయు కాలుష్యంతో కరోనా బారిన పడినవారి ఆరోగ్యం మరింత క్లిష్టమయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. ఇంట్లోనే దీపాలు వెలిగించి పండుగను జరుపుకోవాలని సూచించింది. అలాగే, కాళీ పూజ సందర్భంగా బాణసంచా అమ్మకాలను కోల్‌కతా హైకోర్టు కూడా నిషేధించిన విషయం తెలిసిందే.

నిషేధం ఎత్తివేయాలంటూ తమిళనాడు సీఎం లేఖ
మరోవైపు, బాణసంచా కాల్చడంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ రాజస్థాన్‌, ఒడిశా ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం పళనిస్వామి గురువారం లేఖ రాశారు. రాష్ట్రంలో బాణసంచా ఉత్పత్తి ద్వారా ప్రత్యక్షంగా 4 లక్షల మంది, పరోక్షంగా మరో 4 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని లేఖలో పేర్కొన్నారు. బాణసంచా కాల్చేందుకు విధించిన నిషేధం కారణంగా ఉత్పత్తిదారులు, విక్రయదారులు, కార్మికులు తీవ్రంగా నష్టపోతారన్నారు. దేశంలో బాణసంచా ఉపయోగంలో 90శాతం ఉత్పత్తి తమిళనాడులో జరుగుతోందని తెలిపారు. నిబంధనల ప్రకారమే బాణసంచా తయారు చేస్తున్నారని, దీనివల్ల కాలుష్య సమస్య ఏర్పడదని పేర్కొన్నారు. బాణసంచా కాల్చేందుకు విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *