చెన్నై: ఈశాన్య రుతపవనాలు ప్రభావంతో రాష్ట్రంలో రెండు నెలలుగా ఎడతెరపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. గత నెల నివర్, ఇప్పుడు బురేవి తుపాన్లు భారీ వర్షాలతో రాష్ట్రాన్ని వెంటాడాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారిన ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ జిల్లాలు, డెల్టా జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసాయి. శనివారం మధ్యాహ్నానికి అందిన సమాచారం ప్రకారం అల్పపీడన ద్రోణి రామనాథపురం–పాంబన్ సముద్రతీరంలో గత 40 గంటలకు పైగా ఒకేచోట కేంద్రీకృతమై ఉంది. మన్నార్వలైకుడా సముద్రతీరంలో శుక్రవారం రాత్రి వరకు స్థిరంగా ఉండిన తుపాన్ బలహీనపడి అల్పపీడన ద్రోణిగా మారింది.
శనివారం సాయంత్రం దిండుగల్–మనప్పారై– వేటసత్తూరు మధ్యన పశ్చిమం వైపుగా అరేబియా సముద్రం వైపు కదలడంతో తుపాన్ ముప్పు తప్పింది. అయితే ఈ కారణంగా నీలగిరి, తేనీ, దిండుగల్లు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ, అతి భారీ వర్షాలు కురిసాయి. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, సేలం జిల్లాల్లోని ఒకటి రెండుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడ్డాయి. ఈ కారణంగా కడలూరు, అరియలూరు, కారైక్కాల్, మైలాడుదురై, రామనాథపురం, తంజావూరు, తిరువళ్లూరు, నాగపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రామనాథపురం, మదురై, విరుదునగర్ ఈ మూడు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలకు అవకాశం ఉంది. చెన్నైలో సైతం ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం డైరెక్టర్ పువియరసన్ తెలిపారు.