తెలుగు తేజం, విజయవాడ: మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఏపీ క్రెడాయ్ కార్యవర్గ సభ్యులు రాజా శ్రీనివాస్ బుధవారం ఉదయం భేటీ అయ్యారు. అనంతరం ఏపీ క్రెడాయ్ అధ్యక్షులు రాజా శ్రీనివాస్ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగం కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుందని తెలిపారు. కరోనా కారణంగా.. సొంత ఇంటి విలువ చాలా మందికి తెలిసొచ్చిందన్నారు. గత కొంతకాలంగా ఇళ్ళు, ప్లాట్ల కొనుగోళ్లకు డిమాండ్ పెరిగిందని… అందుకే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న సమస్యలను ప్రభుత్వానికి విన్నవించామని చెప్పారు. స్టాంపు డ్యూటీ డిడక్షన్ వల్ల ప్రజలకు ఎంతో భారం తగ్గుతుందన్నారు. సిమెంట్, ఐరెన్ ధరలను ఉద్దేశపూర్వకంగా సిండికేట్ అయ్యి పెంచేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి వాటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ధరలను నియంత్రించాలని రాజా శ్రీనివాస్ కోరారు.