రాజాం: తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు సహా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లా రామతీర్థం పర్యటనకు వెళ్లిన వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై రాళ్లు, చెప్పుల దాడి ఘటనలో భాగంగా పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా రాజాంలోని తన నివాసంలో రాత్రి 9 గంటల సమయంలో నెల్లిమర్ల పోలీసులు కళాను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం ఆయన్ను చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
గత నెల 29న రామతీర్థంలోని కోదండరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఈనెల 2న తెదేపా అధినేత చంద్రబాబు, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి రామతీర్థం పర్యటనకు వెళ్లారు. తొలుత వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించి కిందికి వస్తున్న సమయంలో ఆయన వాహనంపైకి కొంతమంది రాళ్లు, చెప్పులు, మంచినీటి ప్యాకెట్లు విసిరారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనపై వైకాపా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు పలువురు నేతలపై కేసులు నమోదు చేశారు. దీనిలో భాగంగా ఇప్పుడు కళా వెంకట్రావును పోలీసులు అరెస్ట్ చేశారు.
దోషులను వదిలి.. బీసీ నేతను అరెస్ట్ చేస్తారా?: అచ్చెన్న
మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. రాత్రిపూట ఉగ్రవాదుల తరహాలో ఆయన్ను అరెస్ట్ చేయడం సిగ్గుచేటని ఆక్షేపించారు. కళాను విడుదల చేయకపోతే పీఎస్‌ను ముట్టడిస్తామని.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కళా అరెస్ట్‌కు వైకాపా మూల్యం చెల్లించుకుంటుందన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయం వైకాపాకు పట్టుకుందని చెప్పారు. రామతీర్థం దోషులను వదిలి, బీసీ నేతను అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. తక్షణమే కళా వెంకట్రావును విడుదల చేయాలని అచ్చెన్న డిమాండ్ చేశారు.