రూ.10వేల సాయం కోసం బారులు తీరిన బాధితులు
హైదరాబాద్: నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన బాధితులు ప్రభుత్వం అందించే సాయం కోసం మీ సేవ కేంద్రాలకు బారులు తీరుతున్నారు. ముంపునకు గురైన బాధితులకు తెలంగాణ ప్రభుత్వం రూ.10వేల ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే, వరదల సమయంలో రాష్ట్ర మంత్రులు, అధికారులు బాధితులకు స్వయంగా ఆర్థిక సాయం అందజేశారు. కాగా, కొన్ని చోట్ల సాయం అందడంలేదని ప్రజాప్రతినిధులు ప్రభుత్వ సొమ్మును కొందరికి మాత్రమే అందజేశారని బాధితులు ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం సాయం అందని వారు మీ సేవ కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా సూచించింది.
మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్న బాధితులు బుధవారం సైతం మీ సేవ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు. చలిని సైతం లెక్కచేయకుండా తెల్లవారుజామున 4గంటల నుంచే బారులు తీరారు. నగరంలోని ఎల్బీనగర్, వనస్థలిపురం, సికింద్రాబాద్ సీతాఫల్మండి, శేరిలింగంపల్లి పరిధిలో, అంబర్పేట గోల్నాకా, చందానగర్, సనత్నగర్, మారేడ్పల్లి, ఖైరతాబాద్, కూకట్పల్లి పరిధిలోని మీ సేవ కేంద్రాలకు మహిళలు, వృద్ధులు భారీగా తరలి వచ్చారు. నగరంలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మీ సేవ కేంద్రాల్లో తమ పేర్లు నమోదు చేసుకున్న మరుసటి రోజునే నగదు వారి ఖాతాల్లో జమ అవుతోందన్న సమాచారంతో బాధితులు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. డిసెంబరు 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉండటంతో ఖచ్చితంగా వరద సాయం అందుతుందని బాధితులు ఆశతో ఉన్నారు.