జైపుర్: కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి రాష్ట్రంలో తిరిగి 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల మేజిస్ట్రేటులకు పూర్తి అధికారాలు ఇచ్చినట్లు వెల్లడించారు. శనివారం నుంచి ఈ నిషేధాజ్ఞలు అమలులోకి వస్తాయి. శుక్రవారం నాటికి రాజస్థాన్లో 2లక్షల ముప్పైవేల కేసులు నమోదవ్వగా, 2,100 మరణాలు సంభవించాయి. దేశరాజధాని ప్రాంతంతో పాటు హరియాణా, రాజస్థాన్లలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నట్లు కేంద్రం గురువారం పేర్కొంది. ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేసేందుకు హరియాణా, రాజస్థాన్, గుజరాత్, మణిపూర్ రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపింది.